Gudivada Amarnath: చంద్రబాబు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు: ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్

ap it industry minister gudivada amarnath about visakha source

  • పెట్టుబడుల సదస్సు తర్వాతైనా ప్రతిపక్ష పార్టీలో మార్పు వస్తుందనుకుంటున్నానన్న అమర్నాథ్
  • సుమారు 40 వేల ఎకరాలను పరిశ్రమల కోసం సిద్ధంగా ఉంచామని వెల్లడి
  • రాబోయే రోజుల్లో సీఎం జగన్ వైజాగ్ వస్తారని వ్యాఖ్య

ఏపీలోని సహజ వనరుల గురించి బయటి ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖ పెట్టుబడుల సదస్సులో సీఎం జగన్ బ్రాండ్ కనిపించిందని చెప్పారు. దేశమంతా ఈ సదస్సు గురించి చర్చించుకుంటోందని తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 352 ఎంవోయూలు జరిగాయని అమర్నాథ్ తెలిపారు. తద్వారా 6 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించే దిశగా అడుగులు పడ్డాయని చెప్పారు. దేశంలోనే అధిక వనరులు ఉన్న విశాఖ నగరం ఏపీలో ఉండటం మన అదృష్టమని అన్నారు.

సుమారు 40 వేల ఎకరాలను పరిశ్రమల కోసం సిద్ధంగా ఉంచామన్నారు. వివాద రహిత స్థలం, నిరంతర విద్యుత్, నీటి సరఫరా ఏపీలో అందుతున్నాయని తెలిపారు. కేవలం 21 రోజుల్లోనే 23 ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులను పరిశ్రమలకు అందిస్తామన్నారు.

పెట్టుబడుల సదస్సు తర్వాత అయినా.. ప్రతిపక్ష పార్టీలో మార్పు వస్తుందని అనుకుంటున్నానని అమర్నాథ్ అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా విండ్ లేదా సోలార్ పవర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

రాబోయే రోజుల్లో సీఎం జగన్ వైజాగ్ వస్తారని మంత్రి అన్నారు. గతంలో ఢిల్లీలో స్వయంగా జగనే ఈ విషయాన్ని చెప్పారని వివరించారు. విశాఖకు జగన్ వచ్చే సమయం నెలల నుంచి రోజుల్లోకి వచ్చేసిందని అన్నారు. అనుకున్న సమయానికంటే ముందే విశాఖ నుంచి పాలన సాగబోతోందని చెప్పారు.

  • Loading...

More Telugu News