Capt Bhupendra Singh: జమ్మూ కశ్మీర్ లో అమాయకులను ఎన్ కౌంటర్ చేసిన ఆర్మీ అధికారికి జీవితఖైదు

Life Imprisonment for a army captain who killed three in fake encounter

  • 2020లో షోపియాన్ జిల్లాలో ముగ్గురి కాల్చివేత
  • వారిని ఉగ్రవాదులుగా పేర్కొన్న కెప్టెన్ భూపేంద్ర సింగ్ 
  • కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన కశ్మీర్ పోలీసులు
  • బూటకపు ఎన్ కౌంటర్ అని నిర్ధారణ 

అంశీపొరా ఫేక్ ఎన్ కౌంటర్ కేసులో ఆర్మీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. జమ్మూ కశ్మీర్ లో ఎన్ కౌంటర్ పేరిట ముగ్గురు అమాయకులను చంపిన ఆర్మీ కెప్టెన్ భూపేంద్ర సింగ్ కు జీవితఖైదు విధించాలని సిఫారసు చేసింది. ఆర్మీ అత్యున్నత అధికారులు ఈ శిక్షను ఖరారు చేయాల్సి ఉంది.

2020 జులై 18న రాజౌరీ జిల్లాకు చెందిన ముగ్గురు పౌరులను తీవ్రవాదులన్న ముద్రవేసి షోపియాన్ జిల్లాలో కాల్చి చంపారు. ఇంతియాజ్ అహ్మద్ (20), అబ్రార్ అహ్మద్ (25), మహ్మద్ అబ్రార్ (16) భద్రతా బలగాల కాల్పుల్లో ప్రాణాలు విడిచారు. నాటి ఎన్ కౌంటర్ లో ఆర్మీ కెప్టెన్ భూపేంద్ర సింగ్ నాయకత్వంలోని దళాలు పాల్గొన్నాయి. 

దీనిపై జమ్మూ కశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేసి, ఆర్మీ కెప్టెన్ భూపేంద్ర సింగ్ సహా ముగ్గురిపై చార్జిషీటు దాఖలు చేశాయి. కెప్టెన్ భూపేంద్ర సింగ్ చేసింది బూటకపు ఎన్ కౌంటర్ అని తేలింది. అందుకు ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. 

ఆర్మీ కోర్టు తీర్పుపై పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ స్పందించారు. సైనిక కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి కేసుల్లో బాధ్యతాయుతమైన చర్యలు తీసుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు. 

సైనిక ప్రతినిధి కూడా ఈ తీర్పుపై స్పందించారు. నైతిక విలువలతో కూడిన కార్యకలాపాలు మాత్రమే కొనసాగించాలన్న సిద్ధాంతానికి భారత సైన్యం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. మానవ హక్కుల ఉల్లంఘన, తప్పుడు విధానాల అమలును ఏ స్థాయిలోనూ సహించబోమని ఉద్ఘాటించారు.

  • Loading...

More Telugu News