Vellampalli Srinivasa Rao: పవన్ కు అంబానీ వంటి వాళ్లు అపాయింట్ మెంట్ అయినా ఇస్తారా?: వెల్లంపల్లి
- విశాఖ సదస్సు విజయవంతం అయిందన్న వెల్లంపల్లి
- ఏపీకి రూ.13.41 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని వెల్లడి
- పచ్చమీడియా ఓర్వలేకపోతోందని వ్యాఖ్యలు
- వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబు, పవన్, లోకేశ్ ల పనిబడతామని హెచ్చరిక
విశాఖలో వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం అయిందని, రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చాయని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్రంలో రూ.13.41 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని, రాష్ట్రంలో ప్రత్యక్షంగా 6 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని వివరించారు.
గతంలో చంద్రబాబు ఇంటి ముందు గూర్ఖాలు సూట్లు తొడిగి ఎంవోయూలు చేసుకునేవారని ఎద్దేవా చేశారు. కానీ, సీఎం జగన్ ఏపీకి అంబానీ, అదానీ, జీఎంఆర్ వంటి బడా పారిశ్రామికవేత్తలను తీసుకువచ్చారని తెలిపారు.
విశాఖ సదస్సు విజయవంతం కావడం పట్ల జాతీయ మీడియా మొత్తం జగన్ ను కొనియాడిందని, కానీ పచ్చమీడియా మాత్రం ఓర్వలేకపోతోందని విమర్శించారు. పవన్ కల్యాణ్ కు అంబానీ వంటి పారిశ్రామికవేత్తలు కనీసం అపాయింట్ మెంట్ అయినా ఇస్తారా? అంటూ ఎద్దేవా చేశారు.
2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ ల సంగతి తేలుస్తామని హెచ్చరించారు. అందరూ కలిసి వచ్చినా తమను ఏమీ చేయలేరని వెల్లంపల్లి ధీమా వ్యక్తం చేశారు.