Junior NTR: మనది రక్త సంబంధం కంటే గొప్ప బంధం.. అమెరికాలో ఫ్యాన్స్ తో ఎన్టీఆర్!
- ఆస్కార్ వేడుకల కోసం అమెరికాకు వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్
- అభిమానులతో ప్రత్యేక సమావేశం
- ఫ్యాన్స్ కు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానన్న ఎన్టీఆర్
- ఇంకో జన్మంటూ ఉంటే ఈ అభిమానం కోసమే పుట్టాలని కోరుకుంటున్నానని వ్యాఖ్య
ఆస్కార్ వేడుకల కోసం జూనియర్ ఎన్టీఆర్ నిన్న అమెరికా వెళ్లారు. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ మొత్తం ముందే వెళ్లగా.. వ్యక్తిగత కారణాలతో ఆయన ఆలస్యంగా అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి అభిమానులు ఎన్టీఆర్ కు ఘనంగా స్వాగతం పలికారు.
అభిమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్టీఆర్ మాట్లాడారు. ‘‘మీరు చూపిస్తున్న అభిమానానికి పదాలు కనిపెట్టలేదు. మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి వంద రెట్లు అభిమానం నా గుండెల్లో ఉంది. అది నేను చూపించలేకపోతున్నాను’’ అన్నారు. ‘‘మన మధ్య ఏ రక్త సంబంధం లేదు. నేనేం చేసి మీకు దగ్గరయ్యానో నాకు తెలియటం లేదు. మీరందరూ నా సోదరుల కంటే ఎక్కువ. మనది రక్త సంబంధం కంటే గొప్పదైన బంధం. శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా’’ అన్నారు.
అభిమానుల ప్రేమకు రుణపడిపోయానని చెప్పారు. ఇంకో జన్మంటూ ఉంటే ఈ అభిమానం కోసమే పుట్టాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఎన్టీఆర్ మాట్లాడుతున్నంత సేపు అభిమానులు అరుస్తూనే ఉన్నారు. కేకలు పెడుతూ ఆయన స్పీచ్ ను ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన విషయం తెలిసిందే. 95వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం మార్చి 12న లాస్ ఏంజిల్స్‌లో వైభవంగా జరగనుంది.