Mamata Banerjee: అయినా చాలకపోతే నా తల నరకండి.. ఉద్యోగుల వైఖరిపై మమతా బెనర్జీ అసహనం!

Mamata Banerjee fires On Protests Over Dearness Allowance

  • డీఏ పెంచాలంటూ ఉద్యోగులు చేస్తున్న నిరసనలపై మమతా బెనర్జీ అసహనం
  • ఎక్కువ వేతనాలు చెల్లించడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవని వెల్లడి
  • 3 శాతం అదనంగా డీఏ ఇచ్చామని, ఇంకా కావాలని డిమాండ్ చేయడం సరికాదని వ్యాఖ్య

కరువు భత్యం (డీఏ) పెంచాలంటూ ఉద్యోగులు చేస్తున్న నిరసనలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎక్కువ వేతనాలు చెల్లించడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవని తేల్చిచెప్పారు. ప్రతిపక్షాలన్నీ కలిసి ఉద్యోగుల జీతాల విషయంలో రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. 

అసెంబ్లీలో ముఖ్యమంత్రి మమత మాట్లాడుతూ.. వాళ్లు అడుగుతూనే ఉంటారని, ఇంకా ఎంత ఇవ్వాలని ప్రశ్నించారు. ‘‘డీఏ పెంచడం ప్రభుత్వానికి సాధ్యం కాదు. రాష్ట్ర ఖజానాలో నిధులు లేవు. ఇప్పటికే అదనంగా 3 శాతం డీఏ ఇచ్చాం. ఇంకా కావాలని డిమాండ్ చేయడం సరికాదు. ఇప్పుడు ఇచ్చిన దానితో మీకు సంతోషం కలగకుంటే.. నా తల నరికి తీసుకెళ్లండి’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పే స్కేల్స్ వేర్వేరుగా ఉంటాయి. మేం వేతనంతో కూడిన 40 రోజుల సెలవులు మంజూరు చేస్తాం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో ఎందుకు పోల్చరు? మేం ఉచితగా బియ్యం ఇస్తాం. మరి వంట గ్యాస్ రేటు ఎంతో చూడండి? ఎన్నికలైపోయిన తర్వాతి రోజే ధరలు పెంచారు’’ అని మమత మండిపడ్డారు.

ఫిబ్రవరి 15న అసెంబ్లీలో బెంగాల్ రాష్ట్ర బడ్జెట్ ను మంత్రి చంద్రిమ భట్టాచార్య ప్రవేశపెట్టారు. పెన్షనర్లు సహా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మార్చి నుంచి 3 శాతం డీఏను అదనంగా చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. బేసిక్ శాలరీపై ఇప్పటికే 3 శాతం డీఏ చెల్లిస్తుండగా.. అదనంగా మరో 3 శాతం చెల్లిస్తామని చెప్పారు. అయినా డీఏ ఇంకా పెంచాలని డిమాండ్లు వస్తున్నాయి. లెఫ్ట్, బీజేపీ తదితర పార్టీలు ఉద్యోగులకు మద్దతు ఇస్తున్నాయి.

  • Loading...

More Telugu News