Kim Yo Jong: అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన కిమ్ సోదరి
- అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు
- తమ క్షిపణులను అడ్డుకుంటే యుద్ధం ప్రకటించినట్టేనన్న జోంగ్
- తమను తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరిక
- పసిఫిక్ మహాసముద్రంలోకి మరిన్ని క్షిపణులు ప్రయోగించగలమని వెల్లడి
ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ పెద్ద నియంత అనుకుంటే, ఆయన చెల్లెలు కిమ్ యో జోంగ్ తాను కూడా తక్కువ తినలేదని నిరూపించుకుంటున్నారు. తన సోదరుడి బాటలోనే, తాజాగా అగ్రరాజ్యం అమెరికాకు గట్టి హెచ్చరికలు చేశారు.
అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేపట్టడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం చెప్పారు. తాము పరీక్షించే క్షిపణులను కూల్చివేస్తే, అది ఉత్తర కొరియాపై యుద్ధం ప్రకటించినట్టుగానే భావిస్తామని కిమ్ యో జోంగ్ స్పష్టం చేశారు. ఉత్తర కొరియా వ్యూహాత్మకంగా క్షిపణి పరీక్షలు చేపడుతోందని, అందుకు వ్యతిరేకంగా అమెరికా చేపట్టే ఎలాంటి సైనిక చర్య అయినా అది యుద్ధ ప్రకటనే అవుతుందని తేల్చి చెప్పారు.
తమను తక్కువ అంచనా వేయొద్దని, పసిఫిక్ మహాసముద్రంలోకి పెద్ద సంఖ్యలో క్షిపణులను ప్రయోగించగలమని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా సంస్థ కేసీఎన్ఏ పేర్కొంది.