MM Sreelekha: రాజమౌళి, కీరవాణి మధ్య అనుబంధాన్ని తెంచాలనుకోవడంలేదు: ఎంఎం శ్రీలేఖ
- టాలీవుడ్ లో మహిళా సంగీత దర్శకురాలిగా ఉన్న ఎంఎం శ్రీలేఖ
- సోదరులు రాజమౌళి, కీరవాణిది హిట్ కాంబినేషన్ అని వెల్లడి
- తానెప్పుడూ రాజమౌళిని చాన్స్ అడగలేదన్న శ్రీలేఖ
టాలీవుడ్ లో దర్శకుడు రాజమౌళి కుటుంబానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆయన కుటుంబంలో దర్శకులు, రచయితలు, సంగీత దర్శకులు, నటులు, గాయకులు ఉండడం తెలిసిందే. ఇక అసలు విషయానికొస్తే... రాజమౌళి సోదరి, సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఓ సినిమాకు సంగీతం అందించే చాన్స్ ఇవ్వాలని తాను ఎప్పుడూ రాజమౌళిని కోరింది లేదని స్పష్టం చేశారు. రాజమౌళి ఓ విజయవంతమైన దర్శకుడు అని, తన సోదరుడు అయినంత మాత్రాన తనకు ఓ సినిమాకు అవకాశం ఇవ్వాలన్న రూల్ లేదని శ్రీలేఖ అభిప్రాయపడ్డారు.
ఏదేమైనా, రాజమౌళి తొలి చిత్రం నుంచి తన పెద్దన్న కీరవాణే సంగీతం అందిస్తున్నారని... రాజమౌళి, కీరవాణి మధ్య అనుబంధాన్ని తాను తెంచాలనుకోవడంలేదని అన్నారు. వాళ్లిద్దరి కాంబినేషన్ లో అనేక మంచి చిత్రాలు వచ్చాయని శ్రీలేఖ వెల్లడించారు.
అంతేకాదు, తాను ఎల్కేజీతో చదువు ఆపేశానని, ఎనిమిదవ ఏటనే తొలిసారిగా ఓ ట్యూన్ కట్టానని ఆమె వెల్లడించారు. ఆ ట్యూన్ ను చిరంజీవి, శ్రీదేవి జంటగా వచ్చిన ఎస్పీ పరశురామ్ చిత్రంలో ఉపయోగించారని తెలిపారు.
అప్పట్లో పెద్దన్నయ్య కీరవాణి ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి వద్ద అసిస్టెంట్ గా పనిచేసేవాడని, ఆదివారం మాత్రం హార్మోనియం పెట్టె ఇంట్లోనే ఉండేదని వివరించారు. తాను నేర్చుకున్న రాగాలను కీరవాణి చెబుతుండేవాడని, తాను ఆ రాగాలను ఇట్టే నేర్చుకునేదాన్నని శ్రీలేఖ తెలిపారు.