Komatireddy Venkat Reddy: కవిత విషయంలో స్పందించాల్సింది నేను కాదు.. రేవంత్ రెడ్డి!: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- లిక్కర్ స్కామ్ లో కవితకు ఈడీ నోటీసులు
- రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్న ఈడీ
- ఇప్పటికే ఢిల్లీకి పయనమైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందనను మీడియా ప్రతినిధులు కోరగా... దీనిపై స్పందించాల్సింది తాను కాదని, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని ఆయన అన్నారు. కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాత ఇంతవరకు రేవంత్ ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు.
మరోవైపు, రేపు ఢిల్లీలోని తమ కార్యాలయంలో తమ ముందు విచారణకు హాజరు కావాలని కవితకు ఇచ్చిన నోటీసుల్లో ఈడీ పేర్కొంది. కవిత ఇప్పటికే ఢిల్లీకి పయనమయ్యారు. అయితే, రేపు ఆమె ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా? అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఇప్పటికే కవిత సన్నిహితుడు రామచంద్రన్ పిళ్లైని ఈడీ అరెస్ట్ చేసింది. కవితకు పిళ్లై బినామీ అని ఈడీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోందనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది.