Australia: ప్రారంభమైన నాలుగో టెస్టు.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా
- బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
- మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన భారత్, ఆసీస్ ప్రధానులు
- స్టేడియం విశేషాలను వివరించిన రవిశాస్త్రి
- ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీకి జ్ఞాపిక అందించిన బీసీసీఐ చీఫ్ బిన్నీ
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో చివరిదైన నాలుగో టెస్టు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. అనుకున్నట్టే మ్యాచ్‌ను వీక్షించేందుకు భారత్, ఆస్ట్రేలియా ప్రధానులు నరేంద్రమోదీ, ఆంటోనీ అల్బానెస్ స్టేడియానికి వచ్చారు. ఈ సందర్భంగా స్టేడియం విశేషాలను కామెంటేటర్ రవిశాస్త్రి ప్రధానులిద్దరికీ వివరించి చెప్పారు. ఇరు దేశాల మధ్య 75 ఏళ్ల స్నేహానికి గుర్తుగా బీసీసీఐ తరపున అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఆసీస్ ప్రధానికి జ్ఞాపిక అందజేశారు. కాగా, ఈ మ్యాచ్‌లో మోదీ టాస్ వేస్తారని భావించినప్పటికీ అది సాధ్యం కాలేదు. అయితే, ఇరు జట్ల ఆటగాళ్లను కలుసుకున్నారు. ఇరు జట్ల కెప్టెన్లు రోహిత్, స్మిత్‌కు ప్రధానులు క్యాప్‌లను అందించారు.
ఇరు జట్లకు కీలక మ్యాచ్
నాలుగో టెస్టు ఇరు జట్లకు ఎంతో కీలకంగా మారింది. భారత్ చేతిలో సిరీస్ ఓడిపోకుండా ఉండాలంటే పర్యాటక జట్టు విజయం సాధించాల్సి ఉంటుంది. ఇండోర్ టెస్టులో ఓడిన భారత జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలను చేజార్చుకుంది. తిరిగి అందులో చోటు ఖాయం చేసుకోవాలంటే ఈ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించాల్సి ఉంటుంది.కాగా, ఆసీస్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ తల్లి అనారోగ్యం కారణంగా స్వదేశానికి వెళ్లడంతో ఈ మ్యాచ్‌కు కూడా స్టీవ్ స్మిత్ సారథ్యం వహిస్తున్నాడు.