Garikapati: నాకంటే చిన్నవాళ్లయినా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు నమస్కారం చేస్తున్నాను: ప్రవచనకర్త గరికపాటి
- నాటునాటు పాట ఆస్కార్ కు నామినేట్ కావడం గొప్ప విషయమన్న గరికపాటి
- చంద్రబోస్ అద్భుతంగా రాశారని కితాబు
- తారక్, చరణ్ మాదిరి నటించడం కవలలకు కూడా చేతకాదని ప్రశంస
భారతీయ సినిమా ఖ్యాతిని 'ఆర్ఆర్ఆర్' చిత్రం ప్రపంచవ్యాప్తం చేసింది. ఈ సినిమాలోని 'నాటునాటు' పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ కు నామినేట్ అయింది. ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ చేసిన డ్యాన్స్ కు అందరూ ఫిదా అవుతున్నారు. 13వ తేదీన ఆస్కార్ అవార్డులను ప్రకటించనున్నారు. ఈ పాటకు ఆస్కార్ అవార్డు రావాలని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఆకాంక్షించారు. అచ్చమైన తెలుగు పాట నాటునాటు ఆస్కార్ కు నామినేట్ కావడం తెలుగువారిగా ఎంతో గర్వించదగ్గ అంశమని చెప్పారు.
ఈ పాట గురించి తనకు ఇంత వరకు తెలియదని.. తన కొడుకుని పిలిచి ఆ పాట ఏమిటో పెట్టరా అని అడిగానని, అరగంటసేపు పాటను చూశానని గరికపాటి తెలిపారు. ఈ పాట ఎందుకంత స్థాయికి వెళ్లిందో తెలుసుకోవాలనుకున్నానని చెప్పారు. ఇంగ్లీష్ మాట లేకుండా ఉన్న అచ్చ తెలుగు పాట అని చెప్పారు. అచ్చ తెలుగు పాటకు ఇద్దరు నటులు చేసిన నటన, రాజమౌళి దర్శకత్వం, కీరవాణి సంగీతం కారణంగా ప్రపంచ స్థాయి బహుమతి రాబోతోందని చెప్పారు. అద్భుతమైన పాట రాసిన చంద్రబోస్ కి నమస్కారమని అన్నారు. ఆస్కార్ కు నామినేట్ కావడమే గొప్ప విషయమని... అలాంటిది భగవంతుడి దయ వల్ల పురస్కారం వస్తే మన ఎంతో అదృష్టవంతులమవుతామని చెప్పారు. ఆస్కార్ రావాలని మనమంతా పూజలు చేద్దామని అన్నారు.
ఈ పాటలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పర్ఫామెన్స్ అద్భుతమని... వయసులో చిన్నవారైనా వారికి నమస్కారం చేస్తున్నానని గరికపాటి చెప్పారు. ఆయన బెల్ట్ తీస్తే ఈయనా తీశాడని... ఆయన కుడికాలు తిప్పితే ఈయనా కుడికాలే తిప్పాడని... ఇద్దరూ అలా కూడబలుక్కుని నటించడమనేది కవలలుగా పుట్టిన వారికి కూడా సాధ్యం కాదని అన్నారు. రెండు వేర్వేరు కుటుంబాల్లో పుట్టిన ఆ ఇద్దరు మహా నటులు అద్భుతమైన ప్రదర్శన చేశారని ప్రశంసించారు.