Kishan Reddy: తెలంగాణ ప్రజలు సిగ్గుపడేలా కవిత చేశారు: కిషన్ రెడ్డి
- ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేయమని కవితను ప్రజలు కోరారా? అన్న కిషన్ రెడ్డి
- మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమెకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అని ప్రశ్న
- దోచుకున్నది సరిపోక ఢిల్లీలో మద్యం దందా చేశారని విమర్శ
తెలంగాణ ప్రజలు సిగ్గుపడేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేయాలని కవితను తెలంగాణ ప్రజలు కోరారా? అని ప్రశ్నించారు. మద్యంపై వచ్చే ఆదాయాన్ని కేసీఆర్ ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారని విమర్శించారు. ప్రతి చోట బెల్ట్ షాపులు పెట్టిన ఘనత కేసీఆర్ దని అన్నారు.
కవితకు మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అని ఎద్దేవా చేశారు. రాజ్యసభకు ఒక్క మహిళను కూడా పంపని చరిత్ర కేసీఆర్ దని అన్నారు. మన రాష్ట్రపతి మహిళ అని, కేంద్రంలో ఎందరో మహిళా మంత్రులు ఉన్నారని చెప్పారు. కేంద్ర ఆర్థికమంత్రి తెలుగు మహిళ అని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏకాభిప్రాయం వస్తే తమకు అభ్యంతరం లేదని చెప్పారు. తెలంగాణలో దోచుకున్నది సరిపోక ఢిల్లీలో మద్యం దందా చేశారని దుయ్యబట్టారు.