Rajamouli: ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యం.. రాయచూరు జిల్లా ఎన్నికల ప్రచారకర్తగా రాజమౌళి
- రాజమౌళి పేరు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సిఫార్సు
- రాజమౌళి కూడా అంగీకరించారన్న రాష్ట్ర పాలనాధికారి
- జిల్లాలోని అమరేశ్వర క్యాంపులో జన్మించిన దర్శకుడు
కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో ఓటింగ్ శాతం పెంపు కోసం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని జిల్లా ఎన్నికల ప్రచార కర్తగా నియమించారు. ఈ మేరకు ఆ జిల్లా పాలనాధికారి చంద్రశేఖర్ నాయక్ తెలిపారు. ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని నిర్ణయించామని, అందుకు రాజమౌళి సరైన వ్యక్తి అని భావించినట్టు నాయక్ తెలిపారు.
రాజమౌళి పేరును రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సిఫార్సు చేశామని, రాజమౌళి కూడా అందుకు అంగీకరించినట్టు చెప్పారు. రాయచూరు జిల్లా మాన్వి తాలూకాలోని అమరేశ్వర క్యాంపులోనే రాజమౌళి జన్మించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఆయనతో ప్రచారం చేయిస్తే పోలింగ్ శాతం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా రాజమౌళి ప్రత్యక్షంగా ప్రచారం చేయడంతోపాటు వీడియో సందేశాల ద్వారా ఓటర్లలో చైతన్యం నింపే ప్రయత్నం చేస్తారు.