Digvijay car: మధ్యప్రదేశ్ లో బైక్ ను ఢీ కొట్టిన దిగ్విజయ్ కారు.. వీడియో ఇదిగో!
- సడెన్ గా రోడ్డు క్రాస్ చేసేందుకు బైకర్ ప్రయత్నం
- వేగంగా వచ్చి ఢీ కొట్టిన కాంగ్రెస్ నేత కారు
- ఎగిరి అవతలపడ్డ బైకర్.. ప్రాణాపాయంలేదన్న వైద్యులు
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రయాణిస్తున్న కారు ఓ బైక్ ను ఢీ కొట్టింది. వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో బైక్ నడుపుతున్న యువకుడు ఎగిరి అవతల పడ్డాడు. గాయాలపాలైన యువకుడిని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. అయితే, బైక్ నడుపుతున్న యువకుడు సడెన్ గా రైట్ టర్న్ తీసుకోవడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ లోని రాజ్ గఢ్ లో గురువారం జరిగిన ఈ ఘటన మొత్తం అక్కడికి దగ్గర్లోని సీసీకెమెరాలో రికార్డు అయింది.
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడి తల్లి చనిపోవడంతో ఆయనను పలకరించేందుకు దిగ్విజయ్ సింగ్ గురువారం ఉదయం కోడక్య గ్రామానికి వెళ్లారు. పార్టీ నేతను పలకరించి, కాసేపు అక్కడే గడిపిన దిగ్విజయ్.. మధ్యాహ్నం తిరిగి రాజ్ గఢ్ కు బయల్దేరారు. సుమారు 3 గంటల ప్రాంతంలో హైవేపై ప్రయాణిస్తుండగా ఓ బైకర్ అడ్డువచ్చాడు. అప్పటి వరకు రోడ్డుకు ఎడమవైపు వెళుతున్న బైకర్ రోడ్డు దాటేందుకు సడెన్ గా రైట్ టర్న్ తీసుకున్నాడు. ఈ క్రమంలో వేగంగా వస్తున్న దిగ్విజయ్ కారు ఆ యువకుడిని డీ కొట్టింది. దీంతో ఆ యువకుడు రోడ్డుకు అవతల ఎగిరిపడ్డాడు.
వెంటనే కారు దిగిన దిగ్విజయ్ పరుగున వెళ్లి యువకుడిని లేపేందుకు ప్రయత్నించారు. తలకు తగిలిన గాయం వల్ల రక్తస్రావం కావడంతో వెంటనే జిరాపూర్ లోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడ్డ యువకుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, తలకు గాయం కావడంతో సీటీ స్కాన్ కోసం భోపాల్ లోని ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు వైద్యులు తెలిపారు. కాగా, ప్రమాదానికి కారణమైన దిగ్విజయ్ కారును సీజ్ చేసి, డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.