BJP: మహిళలకు ప్రాధాన్యమిచ్చే పార్టీ బీజేపీ మాత్రమే: బండి సంజయ్
- 33 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామన్న సంజయ్
- బీఆర్ఎస్ పార్టీలో మహిళలను ఎదగనిస్తున్నారా? అని ప్రశ్న
- ప్రభుత్వంలో ఎంతమందికి అవకాశం కల్పించారని నిలదీత
- ఇక్కడ మహిళలకు అన్యాయం చేసి ఢిల్లీకి వెళ్లి దీక్ష చేయడమేంటన్న బీజేపీ నేత
మహిళలకు రాష్ట్రంలో, ప్రభుత్వంలో అన్యాయం జరుగుతోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఎంతమంది మహిళలకు అవకాశం కల్పించారని ప్రశ్నించారు. తెలంగాణలో మహిళలకు కనీసం 3 శాతం రిజర్వేషన్లు కూడా అమలుచేయని బీఆర్ఎస్ పార్టీ ఈరోజు (శుక్రవారం) ఢిల్లీలో మహిళా బిల్లు కోసం దీక్ష చేయడం హాస్యాస్పదమని విమర్శించారు. రాష్ట్రంలో కవిత తప్ప మరొకరు రాజకీయంగా ఎదగకూడదనే ఉద్దేశంతో మహిళలను కేసీఆర్ సర్కారు అణచివేస్తోందని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను డిమాండ్ చేయాలని ఎమ్మెల్సీ కవితకు బండి సంజయ్ హితవు పలికారు. కేసీఆర్ ప్రభుత్వమే మహిళల ఉసురుపోసుకుందని, పోలీసులతో వారిపై దాడి చేయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు పార్టీ తరఫున చేపట్టిన భరోసా దీక్షలో బండి సంజయ్ బీఆర్ఎస్ పై ఆరోపణలు గుప్పించారు.
మహిళల సంక్షేమానికి దేశంలో కట్టుబడి ఉన్న పార్టీ బీజేపీ ఒక్కటేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్న పార్టీ తమదేనని చెప్పారు. కేంద్ర క్యాబినెట్ లో మహిళలకు సముచిత స్థానం కల్పించామని గుర్తుచేశారు. రాష్ట్రపతిగా, రాష్ట్రాలకు గవర్నర్లుగా మహిళలను ఎంపిక చేసిన పార్టీ బీజేపీ అని వివరించారు. గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తే పలు పార్టీలు అడ్డుకున్నాయని వివరించారు.
అప్పుడు పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రతులను చింపేసిన పార్టీ నేతలతో కలిసి ప్రస్తుతం కవిత దీక్ష చేస్తోందని ఆరోపించారు. అప్పుడు బిల్లు ప్రతిని చింపేసిన నేతలు ఇప్పుడు మద్దతు ఎలా తెలుపుతున్నారని, ముందు వాళ్ల చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. కవిత ఎక్కడ వెనకబడతారోనని బీఆర్ఎస్ పార్టీలో మహిళా నేతలను అణచివేస్తున్నారని సంజయ్ ఆరోపించారు. మద్యం పాలసీ స్కామ్ లో తన పాత్రపై నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నంలో భాగంగానే ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో దీక్ష చేస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు.