Sumalatha: బీజేపీలో చేరతాను... కానీ!: సుమలత
- మాండ్యా ఎంపీగా కొనసాగుతున్న సుమలత
- బీజేపీలో చేరతారంటూ ప్రచారం
- సాంకేతిక కారణాల వల్ల బీజేపీలో ఇప్పుడే చేరబోవడంలేదని వెల్లడి
- బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇస్తానని ప్రకటన
సినీ నటి, మాండ్యా ఎంపీ సుమలత బీజేపీలో చేరనున్నట్టు గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇవాళ మీడియా సమావేశం నిర్వహించి, బీజేపీలో చేరడంపై సుమలత ఓ ప్రకటన చేస్తారని అందరూ భావించారు. అయితే, మీడియా సమావేశం నిర్వహించారు కానీ, తాను ఇప్పుడే బీజేపీలో చేరబోవడంలేదని స్పష్టం చేశారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు.
కేంద్రంలో ఉన్న బీజేపీకి తాను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని మీడియా ముఖంగా వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల తనకు విశ్వాసం ఉందని, సన్నిహితులు, మద్దతుదారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నానని సుమలత పేర్కొన్నారు.
మోదీ నాయకత్వంలో బీజేపీ స్థిరంగా అభివృద్ధి పథంలో పయనిస్తోందని, ప్రపంచ దేశాల మధ్య భారత్ పలుకుబడి పెరగడం వంటి కారణాలు తనను బీజేపీ దిశగా నడిపించాయని వెల్లడించారు. బీజేపీకి మద్దతు ఇవ్వాలన్న నిర్ణయం తన కొడుకు రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్నది కాదని ఆమె స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం తన కొడుకు రాజకీయాల్లోకి రాడని ఆమె తేల్చి చెప్పారు.
మాండ్యా జిల్లాలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే తన లక్ష్యం అని ఉద్ఘాటించారు. తనకు డబ్బు, పేరు ప్రతిష్ఠలతో పనిలేదని, వాటి కోసమే అయితే తాను రాజకీయాల్లోకి రావాల్సిన పనిలేదని, తనకు కావాల్సినంత డబ్బు, పేరు వున్నాయని అన్నారు.
జిల్లాలోని కొందరు నేతల నుంచి తనకు అవమానాలు ఎదురయ్యాయని, అయితే అభివృద్ధి కార్యక్రమాలు, బహిరంగ సభలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించేందుకు బీజేపీ అండ అవసరం అని భావించినట్టు సుమలత వెల్లడించారు.