Swapna Dutt: ‘అర్జున్‌రెడ్డి’ విషయంలో ధైర్యం చేయలేకపోయింది అందుకే: స్వప్నదత్
- కథ తనకు బాగా నచ్చినా సమాజాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి వచ్చిందన్న స్వప్నదత్
- ఆడపిల్ల ఇలాంటి సినిమా తీసిందా? అని అంటారని భయపడ్డానన్ననిర్మాత
- కెరియర్ పరంగా ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని వెల్లడి
- పరాజయం తనకు విజయం రుచి చూపించిందన్నస్వప్న
అర్జున్‌రెడ్డి సినిమాను నిర్మించలేకపోయినందుకు నిర్మాత స్వప్నదత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సినిమా కథ తనకు ఎంతగానో నచ్చిందని, కాకపోతే, సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా తీయలేకపోయానని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. అర్జున్‌రెడ్డి కథ ఎంతగానో నచ్చడంతో సినిమా తీయాలని ఆశపడ్డానని అన్నారు. అయితే, ఒకవేళ సినిమా అటూఇటూ అయితే ఆడపిల్ల ఇలాంటి సినిమా చేసిందా? అని విమర్శిస్తారని భయపడినట్టు చెప్పారు. ‘పెళ్లి చూపులు’ సినిమా ఫార్మాట్ భిన్నంగా ఉండడంతో తనకు అర్థం కాలేదని, అందుకే ఆ సినిమాపై తాను ఆసక్తి చూపించలేదన్నారు.
కెరియర్ పరంగా ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశానన్న స్వప్నదత్.. ఓ చానల్‌ను ప్రారంభించి విఫలమయ్యానని, దీంతో విమర్శలు మూటగట్టుకున్నట్టు చెప్పారు. ఆ చానల్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం ఇబ్బందులు పడుతూనే కొంతకాలం దానిని నడిపించినట్టు చెప్పారు. చివరికి దానిపై ఆశలు వదులుకున్నామని స్వప్నదత్ తెలిపారు.
అప్పటి పరాజయం తమకు విజయం రుచి చూపించిందని, తాము మళ్లీ కమ్‌బ్యాక్ కాగలిగామంటే అందుకు ప్రేక్షకులే కారణమని అన్నారు. ప్రస్తుతం జీవితంలో ప్రతి విషయానికి తాను సంతోషంగా ఉన్నట్టు స్వప్నదత్ తెలిపారు.