adhar: ఆధార్ లో పేరు మార్చుకునే అవకాశం కేవలం రెండుసార్లు మాత్రమే!
- మొబైల్ నెంబర్ సవరణకు ఎలాంటి పరిమితి లేదు
- జెండర్, పుట్టిన తేదీ వివరాలను ఒక్కసారి మాత్రమే మార్చుకోవచ్చు
- ఫొటో అప్ డేట్ కూ అపరిమిత అవకాశం
ఆధార్ కార్డు.. ప్రస్తుతం ప్రతీ పనికీ ఈ కార్డు అవసరం పడుతోంది. సిమ్ కార్డు నుంచి బ్యాంకు ఖాతా, ట్రైన్ రిజర్వేషన్.. ఇలా చాలాచోట్ల ఆధార్ లేకుంటే పనిజరగదు. మరి ఇంతటి కీలకమైన కార్డులో తప్పులుంటే? వివరాలు నమోదు చేసే సమయంలో తప్పులు దొర్లితే ఎలా?.. అంటే మార్చుకోవచ్చని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) తెలిపింది. ఆధార్ కార్డులో తప్పుల సవరణకు, అప్ డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే, కొన్ని వివరాలను పదే పదే మార్చుకోవడానికి వీలులేదని పేర్కొంది. పేరు, జెండర్, పుట్టిన తేదీ తదితర వివరాలను ఒకసారి మాత్రమే మార్చుకునే వీలుంటుందని స్పష్టం చేసింది.
ఆధార్ వివరాలలో ఏది ఎన్నిసార్లు మార్చుకోవచ్చంటే..
- పేరు నమోదులో తప్పులు దొర్లితే రెండు సార్లు మార్చుకునే అవకాశం ఉంటుంది. వివాహం తర్వాత మహిళలు తమ ఇంటిపేరును మార్చుకునే వీలుంటుంది. ఆన్ లైన్ లో సొంతంగా లేదా మీ సేవా సెంటర్ లో ఆధార్ కార్డులోని పేరును మార్చుకోవచ్చు.
- ఆధార్ కార్డులో వివరాలు నమోదు చేసే సమయంలో జెండర్ విషయంలో పొరపాటు జరిగితే ఒకసారి మార్చుకునేందుకు యూఐడీఏఐ వీలు కల్పించింది.
- పుట్టిన తేదీ విషయంలో కూడా ఒకేసారి మార్పులు చేర్పులకు అవకాశం ఉంది.
- ఆధార్ లో పేర్కొన్న నివాస స్థలం, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, ఫొటో, వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ లలో మార్పులు చేర్పులకు ఎలాంటి పరిమితి లేదు. ఈ వివరాలు తరచుగా మారే అవకాశం ఉంది. చిరునామా, ఫోన్ నెంబర్ మారొచ్చు, వయసుతో పాటు శరీరంలో మార్పులు చోటుచేసుకోవచ్చు. అందుకే ఈ వివరాలకు సంబంధించిన సవరణలకు యూఐడీఏఐ ఎలాంటి పరిమితి విధించలేదు.