Ramcharan: మార్వెల్ స్టూడియోతో రాజమౌళి సినిమా తీస్తే పెద్ద పార్టీ ఇస్తా: రామ్ చరణ్
- ఆస్కార్ వేడులకు రెడీ అవుతున్న ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం
- కళను ఆదరించే ప్రతీ దేశంలో, ప్రతీ సినిమాలో నటించాలని ఉందన్న చరణ్
- ఆస్కార్ బరిలో నిలిచిన నాటు నాటు పాట
బాహుబలి 1, 2, ఆర్ఆర్ఆర్ చిత్రాల తర్వాత టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి ఖ్యాతి అమాంతం పెరిగింది. ఆయన హాలీవుడ్ సినిమా చేయాలని పాశ్చాత్య దేశాల సినీ అభిమానులు సైతం కోరుకుంటున్నారు. ప్రఖ్యాత మార్వెల్ స్టూడియోస్ తో కలిసి ఆయన సినిమా చేసే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. ఇది నిజమై, మార్వెల్ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వస్తే తాము పెద్ద పార్టీ ఇస్తానని రామ్ చరణ్ చెప్పారు. నాటునాటు పాట ఆస్కార్ కు నామినేట్ అవ్వడంతో ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం ఇప్పుడు అమెరికాలో సినిమా ప్రమోషన్స్ లో ఉంది. ఈ నెల 12వ తేదీ లాస్ ఏంజెల్స్ లో జరిగే ఆస్కార్ ప్రదానోత్సవానికి సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో ఓ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్.. రాజమౌళి హాలీవుడ్ చిత్రం చేయాలని ఆశిస్తున్నామన్నాడు.
ప్రఖ్యాత మార్వెల్ స్టూడియోతో రాజమౌళి కలిసి పని చేస్తే ఎలా ఉంటుందన్న ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ‘వావ్. అలా జరిగితే మేము మీకు పెద్ద పార్టీని ఇవ్వబోతున్నాం. అది నిజం కావాలని నేనూ ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నాడు. మార్వెల్, స్టార్ వార్స్ ఫ్రాంచైజీలో నటించాలనుకుంటున్నారా? అని వ్యాఖ్యాత అడగ్గా.. ప్రజలు ఆదరించే ప్రతి దేశంలో, ప్రతి సినిమాలో నటించాలని అనుకుంటున్నట్టు చరణ్ చెప్పాడు. ‘ప్రజలు వీక్షించే, టిక్కెట్లు కొనే ప్రతి ఫ్రాంచైజీలో నేను ఉండాలనుకుంటున్నాను. కళను, చిత్రాలను ఆదరించే ప్రతీ దేశంలో అలాంటి ప్రతీ సినిమాను నేను కోరుకుంటాను. సినిమా అనేది ఇప్పుడు విశ్వవ్యాప్తం అయింది. ఇకపై బాలీవుడ్, హాలీవుడ్ అనే హద్దులేవీ ఉండబోవు. అన్ని హద్దులను చెరిపివేసి గ్లోబల్ సినిమాగా అవతరిస్తోంది. అందులో భాగమైనందుకు నేను చాలా అదృష్టవంతుడిని’ అని చరణ్ చెప్పుకొచ్చాడు.