YS Sharmila: రాష్ట్ర మహిళా కమిషన్ ఉన్నది ముఖ్యమంత్రి బిడ్డ కోసమేనా?: షర్మిల

Sharmila take a swipe at state commission for women

  • కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలు
  • సుమోటోగా స్పందించిన రాష్ట్ర మహిళా కమిషన్
  • బండి సంజయ్ కి నోటీసులు
  • విచారణ జరపాలంటూ డీజీపీకి ఆదేశాలు
  • మహిళా కమిషన్ పై తీవ్ర విమర్శలు చేసిన షర్మిల

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన వ్యాఖ్యలకు గాను బండి సంజయ్ కి రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయడం తెలిసిందే. విచారణ జరపాలంటూ డీజీపీని కూడా ఆదేశించింది. దీనిపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. 

రాష్ట్ర మహిళా కమిషన్ ఉన్నది ముఖ్యమంత్రి బిడ్డ కోసమేనా? లేక రాష్ట్రంలోని మహిళలందరి కోసమా? అని ప్రశ్నించారు. మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించడం సంతోషం అని వ్యాఖ్యానించారు. అదే మేము మీకు వందలసార్లు కంప్లైంట్ చేస్తే ఎందుకు స్పందించలేదు? ఎందుకు చలనం రాలేదు? అని మహిళా కమిషన్ ను నిలదీశారు. 

"నేను ముఖ్యమంత్రి బిడ్డను కాదనా? లేక సాధారణ మహిళల కోసం మీ కమిషన్ పనిచేయదా? మంత్రి నిరంజన్ రెడ్డి ఒక మహిళను పట్టుకుని మంగళవారం మరదలు అంటే మీకు కనబడలేదు. కేటీఆర్ వ్రతాలు చేసుకోండి అంటే మీకు కనబడలేదు. ఒక ఎమ్మెల్యే అనుచరులు మాపై దాడి చేస్తే మీకు కనబడలేదు. మహిళలను కించపరుస్తూ మాట్లాడుతున్న అధికార పార్టీ మాటలు మీకు వినపడవు... వారి అకృత్యాలు కనబడవు... వారు చేసే అత్యాచారాలు కనబడవు. కానీ ముఖ్యమంత్రి బిడ్డ మీద చీమ వాలేసరికి మీకు బాధ్యత గుర్తుకు వస్తుంది. ఎందుకంటే మీది మహిళల కోసం పనిచేసే కమిషన్ కాదు. 

మీది బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసే కమిషన్... బీఆర్ఎస్ కమిషన్... బీఆర్ఎస్ పార్టీలోని మహిళల కోసం మాత్రమే పనిచేసే కమిషన్. నిజంగా మీది మహిళల కోసం పనిచేసే కమిషన్ అయితే... మీకు ఇచ్చిన ఫిర్యాదులపై స్పందించి బీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోండి" అంటూ షర్మిల డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News