oscars 2023: ఆస్కార్ వేడుకల్లో రెడ్ కార్పెట్ రంగు మారిందిగా..!
- ఈ రోజు అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఆస్కార్ అవార్డు వేడుకలు
- 1961 తర్వాత తొలిసారి కార్పెట్ రంగు మార్చిన అకాడమీ
- ‘షాంపైన్’ రంగులో కార్పెట్ ఏర్పాటు
ఆస్కార్ అవార్డుల వేడుకలకు రంగం సిద్ధమైంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో మరికొన్ని గంటల్లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే, ఈసారి వేడుకల్లో చిన్న మార్పు చేశారు నిర్వాహకులు. మార్పు చిన్నదే కానీ.. ప్రత్యేకమైనది.
సినీ వేడుకల్లో ప్రత్యేకంగా నిలిచే రెడ్ కార్పెట్ రంగును ఆస్కార్ అకాడమీ మార్చింది. 1961 నుంచి అంటే 33వ అకాడమీ అవార్డు వేడుకల నుంచి రెడ్ కార్పెట్ పై సినీ స్టార్స్ నడుస్తూ ఉండగా.. ఈసారి ‘షాంపైన్’ రంగును అకాడమీ ఎందుకుంది. సంవత్సరాల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని మార్చేందుకు సిద్దమైంది.
ప్రపంచం నలుమూలల్లో ఎక్కడ అవార్డుల వేడుక జరిగినా.. రెడ్ కార్పెట్ కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఆస్కార్ లాంటి ప్రతిష్ఠాత్మక అవార్డుల వేడుకల్లో అయితే.. కనీసం రెడ్ కార్పెట్ పై నడిచే అవకాశం వస్తే చాలని చాలా మంది భావిస్తుంటారు. హీరోయిన్స్ హొయలొలికిస్తూ.. ఫొటోలకు పోజులిస్తుంటారు. మరి షాంపైన్ రంగులో కార్పెట్ ఎలా కనిపిస్తోందో చూడాలి. హాలీవుడ్ లోని డాల్బీ థియేటర్స్ లో జరగనున్న ఈ ఆస్కార్ వేడుకలకు అకాడమీ భారీ ఏర్పాట్లు చేసింది. జిమ్మీ కిమ్మెల్ మూడోసారి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.
ఇక ఆస్కార్ వేడుక మనకు ఎంత స్పెషలో తెలుసు కదా! రికార్డులు బద్దలుకొట్టిన తెలుగు సినిమా ‘ఆర్ఆర్ఆర్’.. అంతర్జాతీయ ఖ్యాతి దక్కించుకుని ఆస్కార్ కు అడుగు దూరంలో నిలిచింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ లోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ కోసం పోటీపడుతోంది. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ సహా చిత్ర బృందం మొత్తం కొన్నిరోజులుగా అమెరికాలోనే ఉంటూ సందడి చేస్తోంది.