Scotland: కన్నకొడుకునే దోపిడీ చేయబోయిన తండ్రి!

Man Mistakenly Attempts To Rob His Own Son At Knifepoint In Scotland
  • స్కాట్‌లాండ్‌లో వెలుగు చూసిన ఘటన
  • విషయం తెలిశాక నిర్ఘాంతపోయిన నిందితుడు
  • నిందితుడికి 26 నెలల జైలు శిక్ష విధించిన కోర్టు
కన్న కొడుకునే పొరపాటున దోపిడీ చేయబోయిన ఓ తండ్రి ఉదంతం స్కాట్‌లాండ్‌లో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడికి కోర్టు 26 నెలల కారాగార శిక్ష విధించింది. గ్లాస్‌గో నగరంలో నివసించే ఓ టీనేజర్ ఇటీవల తన ఇంటికి సమీపంలో ఉన్న ఏటీఎంలో డబ్బు డ్రా చేసుకునేందుకు వెళ్లాడు. డబ్బు తీసుకున్నాక కార్డు జేబులో పెట్టుకుంటుండగా ముసుగు ధరించిన ఓ వ్యక్తి లోపలికి ప్రవేశించాడు. టీనేజర్ వెనుక నిలబడి అతడి మెడపట్టి గోడకు అదిమిపెడుతూ డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేశాడు. టీనేజర్ తల కూడా కప్పి ఉండటంతో నిందితుడు తన ఎదురుగా ఉన్నది ఎవరో గుర్తుపట్టలేకపోయాడు. 

ఎవరో బెదిరిస్తున్నారనుకుని తొలుత షాకైన టీనేజర్.. ఆ గొంతు తన తండ్రిదని గుర్తుపట్టి నిర్ఘాంతపోయాడు. ‘‘ఏం చేస్తున్నావు? నేనెవరో తెలుసా?’’ అని తండ్రిని ప్రశ్నించాడు. ‘‘నువ్వెవరైనా నాకు లెక్క లేదు’’ అని తండ్రి జవాబివ్వడంతో టీనేజర్ ఒక్కసారిగా వెనక్కు తిరిగాడు. దీంతో.. షాకైపోవడం తండ్రి వంతైంది. తాను తన కొడుకునే దోపిడీ చేయబోయానని తెలుసుకున్న ఆ తండ్రికి ఏం చేయాలో తోచక అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తరువాత కుమారుడి ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేరం నిర్ధారణ కావడంతో నిందితుడికి కోర్టు 26 నెలల కారాగార శిక్ష విధించింది. ‘‘ఇదో అసాధారణ ఘటన’’ అని న్యాయమూర్తి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
Scotland
Offbeat
robbery
son
father
knifepoint

More Telugu News