NTR: ప్రేక్షకులు ఇంత గమనిస్తారా? అనుకున్నా.. కానీ తర్వాత అర్థమైంది..: ఎన్టీఆర్
- తాను, రామ్ చరణ్ ఒకే సింక్ లో చేయడం కష్టంగా అనిపించిందన్న ఎన్టీఆర్
- రోజూ 3 గంటలు ప్రాక్టీస్ చేసే వాళ్లమని వెల్లడి
- ప్రేక్షకులకు ఏం కావాలో రాజమౌళికి తెలుసంటూ ప్రశంసలు
ఆస్కార్ అవార్డుకు అడుగు దూరంలో నిలిచింది ‘ఆర్ఆర్ఆర్’. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి దుమ్మురేపిన ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో పోటీ పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎందరినో ఆకట్టుకున్న ఈ పాటకు అవార్డు వస్తుందా లేదా అనేది మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది.
మరోవైపు ఆస్కార్ వేడుకల కోసం అమెరికాకు వచ్చిన ఆర్ఆర్ఆర్ టీమ్ కొన్నిరోజులుగా సందడి చేస్తోంది. మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది. తాజాగా ఎన్టీఆర్ ఓ హాలీవుడ్ చానల్ తో మాట్లాడారు. నాటు నాటు పాట కోసం తాము పడిన కష్టం గురించి, రాజమౌళి పర్ఫెక్షన్ గురించిన ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.
నాటు నాటు పాటకు తాను, రామ్ చరణ్ చేసిన డ్యాన్స్ కంటే.. ఇద్దరం ఒకే సింక్ లో చేయడం కష్టంగా అనిపించిందని ఎన్టీఆర్ చెప్పారు. ఆ పాట కోసం తాము రోజూ 3 గంటలు ప్రాక్టీస్ చేసే వాళ్లమని తెలిపారు. షూటింగ్ కు ముందు, షూటింగ్ జరిగేటప్పుడు కూడా రిహార్సల్స్ చేస్తూనే ఉండే వాళ్లమని చెప్పారు.
‘‘ఆ పాట షూటింగ్ సమయంలో రాజమౌళి.. మా ఇద్దిరి మూమెంట్ ఒకేలా ఉండాలని ఎన్నో టేక్ లు తీసుకున్నారు. ప్రేక్షకులు ఇంత గమనిస్తారా? అని అప్పుడు అనుకున్నా. కానీ పాట విడుదల అయ్యాక ప్రతి ఒక్కరూ మా ఇద్దరి డ్యాన్స్ సింక్ గురించి మాట్లాడుకున్నారు. ప్రేక్షకులకు ఏం కావాలో రాజమౌళికి తెలుసని అప్పుడు అర్థమైంది’’ అని ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించారు.
ఆర్ఆర్ఆర్.. పూర్తిగా స్నేహానికి సంబంధించిన సినిమా అని ఎన్టీఆర్ చెప్పారు. సినీ రంగంలోనే పెద్ద పండుగగా భావించే ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ లో తమ సినిమా భాగమైందని, ఒక నటుడిగా ఇంతకుమించి తానేం అడగగలనని అన్నారు. ఆస్కార్ వేడుకల కోసం తాను ఎంతగానో ఎదురుచూస్తున్నానని చెప్పారు. ఓ భారతీయుడిగా ఈ వేడుకకు హాజరవుతానని తెలిపారు. తన వస్త్రధారణ విషయంలోనూ భారతీయత కనిపించేలా ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చారు.