Team India: ఎన్నాళ్లో వేచిన శతకం.. మూడేళ్ల తర్వాత టెస్టు సెంచరీ సాధించిన కోహ్లీ
- అద్భుత శతకం సాధించిన విరాట్ కోహ్లీ
- అర్ధ శతకం ముందు ఔటైన కేఎస్ భరత్
- తొలి ఇన్నింగ్స్ లో ఆధిక్యం దిశగా భారత్
టీమిండియా బ్యాటింగ్ లెజెండ్ విరాట్ కోహ్లీ టెస్టు ఫార్మాట్ లో ఎట్టకేలకు శతక కరువు తీర్చుకున్నాడు. మూడేళ్లుగా మూడంకెల స్కోరు చేయలేకపోతున్న విరాట్.. ప్రపంచంలోనే అతి పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో శతక గర్జన చేశాడు. ఆస్ట్రేలియా బౌలింగ్ ను దీటుగా ఎదుర్కొంటూ 241 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు. అతను చివరగా 2019 నవంబర్ లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో శతకం సాధించాడు. ఇన్నాళ్లకు కోహ్లీ జోరు చూపెట్టడంతో నాలుగో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ లో ఆధిక్యం దిశగా ముందుకెళ్తోంది. ఓవర్ నైట్ స్కోరు 289/3తో ఆట కొనసాగించిన భారత్ ఆరంభంలోనే రవీంద్ర జడేజా (28) వికెట్ కోల్పోయింది.
తెలుగు ఆటగాడు కేఎస్ భరత్ (44) తోడుగా ఐదో వికెట్ కు కోహ్లీ 86 పరుగులు జోడించాడు. రెండు భారీ సిక్సర్లతో అర్ధ శతకానికి చేరువైన భరత్ ను లైయన్ వెనక్కుపంపాడు. అయితే, లైయన్ బౌలింగ్ లోనే సింగిల్ తో కోహ్లీ టెస్టుల్లో తన 28వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికి తోడైన అక్షర్ పటేల్ దూకుడుగా ఆడుతున్నాడు. కోహ్లీ 127, అక్షర్ 25 పరుగులతో నిలవగా.. భారత్ 152 ఓవర్లలో 447/5 స్కోరుతో ఆడుతోంది.