kapil sharma: డిప్రెషన్ తో చనిపోదామని అనుకున్నా.. కమెడియన్ కపిల్ శర్మ సంచలన వ్యాఖ్యలు

kapil sharma opens up about depression recalls time when he had suicidal thoughts

  • ఐదేళ్ల కిందట ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని చెప్పిన కపిల్ శర్మ
  • ఒంటరిగా అయిపోయినట్టుగా మానసిక ఒత్తిడికి గురయ్యానని వెల్లడి
  • బాధ, సంతోషం ఏదైనా కొంతవరకే ఉంటాయని తర్వాత అర్థమైందని వ్యాఖ్య

కపిల్ శర్మ.. బాలీవుడ్ లో ప్రస్తుతం నంబర్ వన్ కమెడియన్. అదిరిపోయే పంచ్ లతో అందరినీ నవ్విస్తుంటారు. కొత్త సినిమా ప్రమోషన్ల కోసం ‘ది కపిల్‌శర్మ షో’కి తారలు క్యూ కడుతుంటారు. అలాంటి కపిల్ శర్మ కూడా ఒకప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు. తాను ఒంటరి తనాన్ని అనుభవించానని, చచ్చిపోవాలని అనుకున్నానని చెప్పుకొచ్చారు.

కపిల్ శర్మ నటించిన ‘జ్విగాటో’ సినిమా.. త్వరలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ న్యూస్ చానల్ కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. తన జీవితంలోని చీకటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఐదేళ్ల కిందట తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని చెప్పారు. 

2017లో ఫిరంగి సినిమా సరిగ్గా ఆడకపోవడం, తోటి కమెడియన్ సునీల్ గ్రోవర్ తో వివాదం తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని, చనిపోదామని అనుకున్నానని కపిల్ శర్మ చెప్పారు. ‘‘ఓ సెలబ్రిటీగా కోట్ల మందికి మీరు తెలిసి ఉంటారు. మీరు వాళ్లను అలరిస్తారు. కానీ ఇంటికి వెళ్లిన తర్వాత.. అక్కడ ఒంటరిగా ఉంటారు. కనీసం బయటికి వెళ్లి.. బీచ్‌లో కూర్చుని సముద్రం వైపు చూసే సాధారణ జీవితం గడిపే పరిస్థితి కూడా లేదు. రెండు గదుల ఫ్లాట్‌లో ఉంటూ.. బయటి చీకటిని చూస్తున్నప్పుడు ఎంత బాధగా ఉంటుందో నేను వివరించలేను’’ అని చెప్పారు.

‘‘అప్పుడు నేను ఆత్మహత్య గురించి ఆలోచించాను. నా కష్టసుఖాలను పంచుకునే వారు ఎవరూ లేరని అనుకున్నాను. మానసిక ఒత్తిడిపై అవగాహన లేనిచోటు నుంచి వచ్చాను. ఈ దశను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి అని అనుకోవడంలేదు. చిన్నతనంలోనే మానసిక క్షోభకు గురయ్యాను. కానీ ఎవరూ పట్టించుకోలేదు’’ అని కపిల్ చెప్పారు. 

“డబ్బు సంపాదించడం కోసం కుటుంబాన్ని వదిలి ఒంటరిగా వచ్చినప్పుడు.. జాగ్రత్తగా చూసుకోవడానికి, విషయాలు అర్థమయ్యేలా చెప్పడానికి ఎవరూ లేనప్పుడు.. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నిగూఢమైన ఉద్దేశాలు మీకు అర్థం కావు. ఒంటరిగా అయిపోయినట్టు ఉంటుంది. అలాంటి దశను దాటిన తర్వాత, మీ చుట్టూ జరుగుతున్న విషయాలను గమనించడం ప్రారంభిస్తారు. మీ కళ్లు తెరుచుకుంటాయి. ఒక కళాకారుడు సెన్సిటివ్‌గా ఉన్నాడంటే.. దాని అర్థం అతడు తెలివి తక్కువవాడు అని కాదు’’ అని కపిల్ శర్మ వివరించారు. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న తర్వాత.. బాధ, సంతోషం ఏదైనా కొంతవరకే ఉంటాయని అర్థమైందని తెలిపారు.

  • Loading...

More Telugu News