Narendra Modi: ఇలాంటి వాళ్లు భగవాన్ బసవేశ్వరుడ్ని కూడా అవమానిస్తారు: ప్రధాని మోదీ
- కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో మోదీ పర్యటన
- బెంగళూరు-మైసూరు 10 లేన్ల ఎక్స్ ప్రెస్ హైవే ప్రారంభం
- పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- భారత ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు తలెత్తడం దురదృష్టకరమన్న మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నేడు కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో పర్యటించారు. బెంగళూరు-మైసూరు 10 లేన్ల ఎక్స్ ప్రెస్ హైవేని ప్రారంభించారు. దాంతో పాటే వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు.
భారత ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచాలని కొందరు నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారని, కానీ భారత ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయగల శక్తి ఏదీ లేదని స్పష్టం చేశారు. ప్రపంచం అంతా భారత ప్రజాస్వామ్యం గురించి అధ్యయనం చేస్తుంటే, లండన్ నేలపై భారత ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు తలెత్తడం బాధాకరమని అన్నారు. ఇలాంటి వ్యక్తులు భగవాన్ బసవేశ్వరుడ్ని, రాష్ట్ర ప్రజలను, దేశ ప్రజలను అవమానిస్తున్నారని, ఇలాంటి వారికి కర్ణాటక దూరంగా ఉండాలని మోదీ పేర్కొన్నారు.
ఇటీవల లండన్ పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీ కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చేసిన ప్రసంగం బీజేపీ నేతలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తుండడం తెలిసిందే.