Michelle Yeoh: ఉత్తమ నటిగా ఆస్కార్ గెలిచిన తొలి ఆసియా మహిళ
- మలేసియాకు చెందిన మిచెల్లే యేహ్ ను వరించిన పురస్కారం
- ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ సినిమాలో నటనకు గుర్తింపు
- పెద్ద కలలు కూడా నిజమవుతాయనడానికి నిదర్శనమన్న నటి
ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డు తొలిసారి ఆసియాకు చెందిన ఓ మహిళను వరించింది. ఉత్తమ నటిగా ఆస్కార్ 2023 అవార్డును మలేషియాకు చెందిన మిచెల్లే యేహ్ అందుకున్నారు. ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ సినిమాలో నటనకు గాను ఆమెకు పురస్కారం లభించింది. అవార్డు స్వీకరిస్తూ మిచెల్లే ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు.
‘‘నా మాదిరి ఈ రాత్రి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బాలురు, బాలికలు అందరికీ ఇది ఆశాకిరణం. కలలు పెద్దగా ఉంటాయని, అవి సాధ్యమేనని అనడానికి ఇదొక నిదర్శనం’’ అని మిచెల్లే ఆస్కార్ పురస్కారాన్ని తీసుకున్న సందర్భంగా పేర్కొన్నారు. 1935లో ఆసియా నుంచి మెర్లే ఒబెరాన్ ఉత్తమ నటి కేటగిరీకి నామినేట్ అయినా కానీ అవార్డు గెలుచుకోలేకపోయింది.