Ap Assembly: కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం!
- ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలు
- గవర్నర్ గా తొలి అధికారిక కార్యక్రమంలో పాల్గొననున్న అబ్దుల్ నజీర్
- ఈ ఏడాది బడ్జెట్ రూ. 2.60 లక్షల కోట్లకు పైగా ఉండే అవకాశం
ఏపీ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ గా బాధ్యతలను స్వీకరించిన తర్వాత అబ్దుల్ నజీర్ పాల్గొంటున్న తొలి అధికారిక కార్యక్రమం ఇదే కావడం గమనార్హం. గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే ఉభయ సభలు వాయిదా పడనున్నాయి.
గవర్నర్ ప్రసంగం తర్వాత అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. సభను ఎన్నిరోజులు నిర్వహించాలి, రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీ, ఏయే అంశాలపై చర్చించాలి? వంటి అంశాలను బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. మరోవైపు ఈనెల 24వ తేదీ వరకు సమావేశాలను నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూ. 2.60 లక్షల కోట్లకు పైగా ఉండే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈ బడ్జెట్ సమావేశాల్లో సీఎం జగన్ పలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది.