Maharashtra: ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై దాడి చేసిన పంది
- మహారాష్ట్ర గొండా జిల్లాల్లో వెలుగు చూసిన ఘటన
- అకస్మాత్తుగా బాలుడిపై పంది దాడి
- చిన్నారి పరిస్థితి విషమం
ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ బాలుడిపై పంది దాడి చేసింది. మహారాష్ట్రలోని గోండా జిల్లాలో జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాలుడు తన స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా ఓ పంది అకస్మాత్తుగా అతడిపై దాడి చేసింది. బాలుడి చేతులు, ఉదర భాగంలో పలుమార్లు కరిచింది. అతడు దాన్ని తోలేందుకు ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. భయంతో చిన్నారి పెద్ద పెట్టున కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై పందిని తోలేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇటీవల కుక్కలు దాడి చేయడంతో ఢిల్లీకి చెందిన అన్నదమ్ములు మృతి చెందారు. మార్చి 10న ఆనంద్ అనే బాలుడు(7) కుక్కల దాడిలో మరణించాడు. ఇది జరిగి 24 గంటలు కూడా గడవక మునుపే బాలుడి తమ్ముడు(5) కూడా కుక్కల దాడికి బలయ్యాడు. మూత్ర విసర్జన కోసం బయటకు వెళ్లిన అతడిపై కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. పిల్లాడు ఎంతకీ రాకపోవడంతో బయటకు వెళ్లి చూసిన కుటుంబసబ్యులకు అతడు రోడ్డుపై విగతజీవిగా కనిపించాడు.