Oscars 2023: ఆస్కార్ వేడుకల నేపథ్యంలో.. ఎన్టీఆర్ మరో ఘనత!

NTR is number one on Top Male Mentions from Oscars 2023 Ram Charan secures second spot
  • సోషల్ మీడియా, న్యూస్ మీడియాలో ఎక్కువ సార్లు ప్రస్తావనకు వచ్చిన నటుడిగా ఎన్టీఆర్ రికార్డు
  • తర్వాతి స్థానాల్లో రామ్ చరణ్, కె.హుయ్ ఖ్యాన్, బ్రెండన్ ఫ్రేజర్
  • మీడియాలో అత్యధిక సార్లు ప్రస్తావించిన సినిమాగా ఆర్ఆర్ఆర్
  • వెల్లడించిన ‘నెట్ బేస్ క్విడ్’ సంస్థ
భారతీయులకు ముఖ్యంగా తెలుగు వారికి ఎన్నో మరపురాని అనుభూతులను పంచుతూ ఆస్కార్ వేడుకలు నిన్న ముగిశాయి. ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా 18.7 మిలియన్ల (1.87 కోట్లు) మంది వీక్షించారు. ఈ ఈవెంట్ ను ప్రత్యక్ష ప్రసారం చేసిన ఏబీసీ.. ఈ విషయాన్ని వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే వీక్షకుల సంఖ్య 12 శాతం పెరిగినట్లు చెప్పింది. 

సోషల్ మీడియాను విశ్లేషించే ‘నెట్ బేస్ క్విడ్’ సంస్థ.. మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఆస్కార్ వేడుకల సందర్భంగా సోషల్ మీడియా, న్యూస్ మీడియాలో అత్యధికంగా ప్రస్తావించిన నటుల జాబితాలో ఎన్టీఆర్ నంబర్ వన్ స్థానంలో ఉన్నట్లు తెలిపింది. రెండో స్థానంలో మరో ఆర్ఆర్ఆర్ స్టార్ రామ్ చరణ్ ఉన్నట్లు వెల్లడించింది. వారిద్దరి తర్వాతి స్థానాల్లో ‘ఎవ్రీథింగ్’ సినిమాతో ఉత్తమ సహనటుడిగా అవార్డు అందుకున్న కె.హుయ్ ఖ్యాన్, ‘ది వేల్’తో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న బ్రెండన్ ఫ్రేజర్, అమెరికన్ యాక్టర్ పెడ్రో పాస్కల్ ఉన్నట్లు చెప్పింది.

అలాగే మీడియాలో అత్యధిక సార్లు ప్రస్తావించిన సినిమాగా కూడా ఆర్ఆర్ఆర్ నిలవడం గమనార్హం. తర్వాతి స్థానాల్లో ఎలిఫెంట్ విస్పరర్స్, ఎవ్రిథింగ్ ఎవ్రివేర్ ఆల్ ఎట్ వన్స్ తదితర సినిమాలు ఉన్నాయి. ఇక నటీమణుల విషయానికి వస్తే తొలి స్థానంలో మిషెల్ యో ఉన్నారు. లేడీ గాగా, ఏంజిలా బస్సెట్, ఎలిజిబెత్ ఓల్సెన్, జైమి లీ కర్టిస్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Oscars 2023
NTR
Ram Charan
RRR
Top Male Mentions

More Telugu News