Imran Khan: లాహోర్ లో హైడ్రామా... ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధం

Police deployed at Imran Khan house in Lahore
  • తోష్ ఖానా కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్
  • ఇమ్రాన్ నివాసం వద్ద పోలీసుల మోహరింపు
  • భారీగా తరలివచ్చిన పీటీఐ కార్యకర్తలు
  • కార్యకర్తలను ఉద్దేశించి ఇమ్రాన్ వీడియో సందేశం
తోష్ ఖానా కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇమ్రాన్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దాంతో లాహోర్ లోని ఇమ్రాన్ ఖాన్ నివాసం వద్దకు భారీగా పోలీసులు తరలి వచ్చారు. అటు, పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) కార్యకర్తలు 500 మంది వరకు అక్కడికి చేరుకున్నారు. దాంతో ఇమ్రాన్ నివాసం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. 

న్యాయమూర్తి జెబా చౌదరిని బెదిరించిన కేసులోనూ ఇమ్రాన్ ఖాన్ పై మరో నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది. తోష్ ఖానా కేసులో ఆయన మార్చి 18న కోర్టులో హాజరు కావాల్సి ఉండగా, జెబా చౌదరి కేసులో మార్చి 29న కోర్టుకు రావాల్సి ఉంది. 

తనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వచ్చిన నేపథ్యంలో, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఇమ్రాన్ ఖాన్ వీడియో సందేశం వెలువరించారు. యావత్ దేశం ఏకతాటిపై నిలవాల్సిన అవసరం ఉందని, చట్టాన్ని పరిరక్షించుకునేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు. 

అరెస్ట్ తర్వాత ఇమ్రాన్ ఖాన్ నోరు మూతపడడంతో పాటు, ప్రజలు కూడా సద్దుమణుగుతారని పోలీసులు భావిస్తున్నారని, కానీ వారు తప్పు అని నిరూపించాలని ప్రజలను కోరారు. తనను జైలుకు తరలించినా, ఒకవేళ చంపేసినా... ఇమ్రాన్ ఖాన్ లేకపోయినా పోరాటం కొనసాగిస్తామని ప్రజలు చాటిచెప్పాలని ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు.
Imran Khan
Police
Toshkhana Case
Lahore
PTI
Pakistan

More Telugu News