Pawan Kalyan: ఇప్పుడు నేను చేస్తున్న సినిమాకు రోజుకు రూ.2 కోట్లు తీసుకుంటున్నా: పవన్
- ప్యాకేజీ స్టార్ అంటుండడంపై పవన్ స్పందన
- పళ్లు రాలగొడతానని హెచ్చరిక
- తన చెప్పులు తయారయ్యేది తెనాలిలోనే అని వెల్లడి
- తనకు డబ్బు కొత్త కాదని స్పష్టీకరణ
మరోసారి ప్యాకేజీ మాట ఎత్తితే చెప్పుతో కొడతానని జనసేనాని పవన్ కల్యాణ్ రాజకీయ ప్రత్యర్థులకు హెచ్చరికలు చేశారు. మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడుతూ... తన చెప్పులు విదేశీ బ్రాండ్లు అనుకుంటారని, కానీ తన చెప్పులు తయారయ్యేది తెనాలిలోనే అని, వెంకటేశ్వరరావు అనే వ్యక్తి తయారు చేస్తారని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఆ చెప్పులతో కొడితే దెబ్బ మామూలుగా ఉండదని, పళ్లు రాలిపోతాయని స్పష్టం చేశారు.
తనకు ఏ ప్యాకేజీలు అవసరంలేదని, తనకు డబ్బు కొత్త కాదని అన్నారు. నేను చూడని డబ్బా, నేను చూడని సౌకర్యాలా? అని వ్యాఖ్యానించారు. తాను ఇప్పుడు నటిస్తున్న సినిమా కోసం 22 రోజులు పనిచేస్తానని, ఆ సినిమాకు రోజుకు రూ.2 కోట్లు తీసుకుంటున్నానని పవన్ కల్యాణ్ తన పారితోషికం వివరాలు వెల్లడించారు. ఆ లెక్కన తాను సినిమాకు రూ.44 కోట్లు తీసుకుంటున్నానని, అది మీరు (అభిమానులు) ఇచ్చిన స్థాయేనని వినమ్రంగా తెలిపారు. అయితే అన్ని సినిమాలకు తన పారితోషికం ఇలాగే ఉండదని అన్నారు. డబ్బులతో తనను కొనలేరని పవన్ పునరుద్ఘాటించారు.
ఇక, కులాల మధ్య కొట్లాటలతో సమాజం విచ్ఛిన్నమవుతోందని అన్నారు. తాను కులాల మధ్య చిచ్చుపెట్టలేనని, కులాలు బాగుండాలని కోరుకుంటానని స్పష్టం చేశారు. వంగవీటి రంగా కాపు అని, కానీ ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన మహిళను పెళ్లి చేసుకున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. వంగవీటి రాధా... కాపు, కమ్మ కులాలకు చెందినవారికి పుట్టాడని, ఇక్కడ కులాల పరిస్థితి ఏమీ కాలేదు కదా... వారికి లేని కుల పట్టింపు మీకు ఎందుకు? అని ప్రశ్నించారు.
నాడు రంగా తనకు ప్రాణహాని ఉందన్నా గానీ ఎవరూ రక్షణకు వెళ్లలేదని, ఆయన చనిపోయాక మాత్రం విగ్రహాలు పెట్టారని పవన్ కల్యాణ్ కాపులను విమర్శించారు. ప్రాణాలు నిలబెట్టలేని వాళ్లు విగ్రహాలు ఏర్పాటు చేసి ఏం లాభం? అని నిలదీశారు. వంగవీటి రంగా తనకు చిన్నప్పటి నుంచి తెలుసని వెల్లడించారు. తమ ఇంటికి వంగవీటి రంగా వస్తే, ఆయనకు తాను టీ ఇచ్చానని పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు.