Pawan Kalyan: టీడీపీ అంటే నాకు ఎక్స్ ట్రా ప్రేమేం లేదు: పవన్ కల్యాణ్
- జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం
- మచిలీపట్నంలో భారీ బహిరంగ సభ
- చంద్రబాబు అంటే ఆరాధనాభావం ఏమీలేదన్న పవన్
- గతంలో సీఎం కాబట్టి గౌరవిస్తానని వెల్లడి
మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవంలో పవన్ కల్యాణ్ అనేక అంశాలను ప్రస్తావిస్తూ ప్రసంగించారు. తాను అనుకున్నట్టుగా జనసేన, బీజేపీ ఉమ్మడి కార్యాచరణ జరిగి ఉంటే వైసీపీ వ్యతిరేక ఓటు అనే మాట వచ్చేది కాదని స్పష్టం చేశారు.
తమకు టీడీపీ అంటే ఎక్స్ ట్రా ప్రేమేం లేదని అన్నారు. చంద్రబాబు అంటే తనకు ఆరాధ్య భావమేమీ లేదని పేర్కొన్నారు. ఆయన ఒకప్పుడు ముఖ్యమంత్రిగా చేశారు, సమర్థుడు కాబట్టి గౌరవిస్తున్నానని, ఇప్పటి ముఖ్యమంత్రి కూడా రాజ్యాంగ పదవిలో ఉన్నాడు కాబట్టి, ప్రజలు ఓటేసి ఎన్నుకున్నారు కాబట్టి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతుంటామని వివరించారు.
ఇక, పొత్తుల గురించి ప్రస్తావిస్తూ... టీడీపీ 20 సీట్లకు జనసేనను పరిమితం చేసిందంటూ జరుగుతున్న ప్రచారంపై పవన్ స్పందించారు. చేతులెత్తి మొక్కుతున్నానని, పొత్తుల గురించి తాను ఎక్కడా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. వాట్సాప్ మెసేజులు చూసి మీరు నమ్మేస్తే ఎలా? అని ప్రశ్నించారు. దశాబ్ద కాలం మీకు అండగా ఉన్నాను.. కనీసం నన్ను నమ్మండి, శంకించకండి అని విజ్ఞప్తి చేశారు.
ఈసారి ఎన్నికల్లో జనసేన ఎట్టి పరిస్థితుల్లోనూ బలిపశువు కాబోదని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయోగాలు చేయబోమని చెప్పారు. ఈసారి గెలిచే విధంగానే తమ ప్రణాళిక ఉంటుందని, తనతో సహా గెలిచి తీరాలనే బరిలో దిగుతున్నామని తెలిపారు. నాతో నడిచేవాడే నా వాడు... నన్ను శంకించేవాడు నా వాడు కాదు అని స్పష్టం చేశారు. ఈసారి గెలిచిన తర్వాత ఆవిర్భావ దినోత్సవం జరుపుకుందామని కార్యకర్తల్లో ఉత్సాహం కలిగించే వ్యాఖ్యలు చేశారు.
ఈసారి ఎన్నికల్లో ఓటును వృథా కానివ్వబోమని, జనసైనికులు వచ్చే ఎన్నికల్లో ఏంజరగాలని కోరుకుంటున్నారో అదే జరుగుతుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాల్లో జనసేనది బలమైన సంతకం ఉంటుందని పేర్కొన్నారు.
పవన్ ప్రసంగం హైలైట్స్...
- వైసీపీ నేతలు జనసేన పార్టీపై అడ్డగోలుగా మాట్లాడితే మీవి దిక్కులేని బతుకులు అవుతాయి.
- బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నానో చెబుతా.... మా నాన్న గారు చనిపోతే అస్థికలు కలపడానికి కాశీ వెళ్లాను. అప్పుడే టీవీలో న్యూస్ చూశాను. కసబ్, కొందరు ఉగ్రవాదులు వచ్చి ముంబయిలో అందరినీ కాల్చేస్తున్నారని చెప్పారు. ఇది 72 గంటల పాటు జరిగింది. పార్లమెంటుపైనా ఉగ్రవాదుల దాడి జరిగింది.
- ఈ దేశానికి బలమైన నాయకత్వం కావాలని అప్పుడే నాకు అనిపించింది. 2014లో మోదీ రూపంలో నాకు ఆ నాయకత్వం కనిపించింది. అందుకే బీజేపీతో కలిసి నడిచాం.
- కానీ ప్రత్యేకహోదా కోసం ఆయనకు ఎదురెళ్లి, ఒకవిధంగా వైసీపీకి మద్దతు ఇచ్చాను. కానీ ఇక్కడ ప్రజలు నాకు మద్దతుగా నిలవలేదు. ఇదే గనుక తెలంగాణలో జరిగుంటే యువత గొంతుకలు కోసేసుకునేవాళ్లు. అంత స్ఫూర్తి ఉందక్కడ. మన ఏపీలో ఆ స్ఫూర్తి ఎందుకు లేదు?
- ఆంధ్రాలో ఎవడికైనా అన్యాయం జరుగుతోందంటే... మన కులపోడు కాదులే అంటారు. ఆ విధంగానే నన్ను వదిలేశారు. మీరు వదిలేసినందుకు నాకు శిక్ష... నేను ఒంటరినయ్యాను. నన్ను ఓడించారు.
- అమరావతే రాజధాని అని జాతీయ నాయకులందరూ ఒప్పుకున్నారు. ఓ లాంగ్ మార్చ్ వంటి కార్యక్రమం పెట్టుకుందాం అని నిర్ణయించుకున్నాం. కానీ ఢిల్లీలో ఒప్పుకుని, రాష్ట్రానికి వచ్చేసరికి కొందరు నాయకులు మాటమార్చారు.
- ఎప్పటికప్పుడు నేనే ముందుంటున్నా. కానీ కలిసికట్టుగా అందరూ రాకపోతే నేనేం చేయను?