Donald Trump: రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తా.. మూడో ప్రపంచ యుద్ధం రాకుండా చేస్తా: ట్రంప్

Donald Trump says he is the only presidential candidate who can prevent World War III

  • మరోసారి అమెరికా అధ్యక్ష పదవిపై కన్నేసిన డొనాల్డ్ ట్రంప్
  • ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టిన ట్రంప్
  • పుతిన్ తన మాట వింటారని వ్యాఖ్య

మూడో ప్రపంచ యుద్ధం రాకుండా నిరోధించగల వ్యక్తిని తానేనని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. 2024లో అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగాలనుకుంటున్న ట్రంప్ ఆ దిశగా ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. ఓ ప్రచార కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందని తాను నిజంగా నమ్ముతున్నానని, ప్రపంచానికి ఇంతకంటే ప్రమాదకరమైన సమయం ఎన్నడూ రాబోదన్నారు. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్.. రష్యాను చైనా చేతుల్లోకి తీసుకెళ్లారని ఆరోపించారు. ఇది అణుయుద్ధానికి దారి తీస్తుందన్నారు.  

‘ఈ పరిపాలన మూడో ప్రపంచ యుద్ధంతో ముగుస్తుంది. ఎందుకంటే వారు (బైడెన్) సరిగ్గా మాట్లాడరు. మంచిగా ప్రవర్తించాల్సినప్పుడు కఠినంగా వ్యవహరిస్తారు. వారు కఠినంగా ప్రవర్తించాల్సినప్పుడేమో చక్కగా ప్రవర్తిస్తారు. నిజాయతీగా చెప్పాలంటే అసలు వారు ఏం చేస్తున్నారో వారికే తెలియదు. ఇలాంటి వారితో మనం మూడో ప్రపంచ యుద్ధంతో అంతం అవుతాం’ అని ట్రంప్ పేర్కొన్నారు. 

2024లో తాను విజయం సాధించినట్లయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని 24 గంటల్లో ముగిస్తానని చెప్పారు. గతంలో కూడా ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. తాను రెండోసారి అధికారంలోకి వస్తే ఈ వివాదానికి స్వస్తి చెప్పగలనని పేర్కొన్నారు. వ్లాదిమిర్ పుతిన్‌తో తనకు గొప్ప అనుబంధం ఉందని, రష్యా అధ్యక్షుడు తన మాట వింటారని ట్రంప్ చెప్పారు.

  • Loading...

More Telugu News