Kavitha: ఎన్నిసార్లు విచారణకు పిలిచినా హాజరవుతా: ఎమ్మెల్సీ కవిత
- తాను ఎలాంటి తప్పు చేయలేదన్న కవిత
- ప్రధాని మోదీని ఎవరు ప్రశ్నించినా ఇలానే దాడులు జరుగుతాయని విమర్శ
- మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కేంద్రం విఫలమైందని వ్యాఖ్య
మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. మహిళా బిల్లుపై పార్లమెంటులో ఒత్తిడి తెస్తామని చెప్పారు. బిల్లు ఆమోదం పొందే దాకా పోరాటం చేస్తామన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ కూడా కలిసిరావాలని కోరినట్టు తెలిపారు.
ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లుపై కవిత నిరాహార దీక్ష చేపట్టారు. దానికి కొనసాగింపుగా ఈ రోజు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని కవిత చెప్పారు. ఈడీ తనను ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. ప్రధాని మోదీని ఎవరు ప్రశ్నించినా ఇదే తరహా దాడులు జరుగుతాయన్నారు.