Hyderabad: తెలుగు రాష్ట్రాల మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్.. నాలుగు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖకు!

Railway vow to high speed rail corridor project
  • రెండు కారిడార్లపై ప్రతిపాదన
  • హైదరాబాద్ నుంచి విశాఖకు ఒకటి
  • కర్నూలు నుంచి విజయవాడకు మరొకటి 
  • 220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్న రైళ్లు
  • మరో రెండు నెలల్లో పెట్ సర్వే
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇది శుభవార్తే. హైదరాబాద్ నుంచి విశాఖపట్టణానికి నాలుగంటే నాలుగు గంటల్లోనే చేరుకునేలా ఓ హైస్పీడ్ రైలు కారిడార్‌ ప్రాజెక్టుపై రైల్వే శాఖ పనిచేస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. ఈ కారిడార్‌లో రెండు మార్గాలు ఉంటాయి. అందులో ఒకటి హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా విశాఖకు కాగా, రెండోది కర్నూలు-విజయవాడ. ఈ ప్రతిపాదిత రైలు మార్గాల్లో గరిష్ఠ వేగం 220 కిలోమీటర్లు. ఒకటి, రెండు నెలల్లోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక ఇంజినీరింగ్, ట్రాఫిక్ స్టడీ (పెట్) సర్వే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం, విజయవాడ వెళ్లేందుకు వరంగల్ మీదుగా ఒకటి, నల్గొండ మీదుగా మరో మార్గం అందుబాటులో ఉన్నాయి. వరంగల్ రూట్ గరిష్ఠ సామర్థ్యం 150 కిలోమీటర్లు. అయితే, ఇప్పుడు ప్రతిపాదిత కారిడార్లలో గరిష్ఠంగా 220 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడపాలన్నది రైల్వేశాఖ యోచన. ఇందుకు సంబంధించి ఇటీవల టెండర్లు కూడా పిలిచింది. వాటి నుంచి అధ్యయనం కోసం ఓ సంస్థను ఎంపిక చేస్తుంది. రైల్వే కారిడార్ ఏ మార్గంలో ఉండాలన్న దానిపై ఆ సంస్థ ఆరు నెలల్లో ఓ నివేదిక సమర్పిస్తుంది. దీనిని బట్టి ప్రాజెక్టు ప్రాథమిక అంచనా వ్యయం విషయం తెలుస్తుంది. అనంతరం ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర నివేదిక (డీపీఆర్) రూపొందిస్తారు.

రైల్వే అధికారులు యోచిస్తున్న ప్రకారం.. హైదరాబాద్-విజయవాడ-విశాఖపట్టణం మార్గం శంషాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. అయితే, ఇది వరంగల్ మీదుగా ఉంటుందా? నల్గొండ, గుంటూరు మీదుగా ఉంటుందా? అన్న విషయం తేలాల్సి ఉంది. ప్రాజెక్టులోని మరో మార్గం విజయవాడ-కర్నూలు మధ్య ఉంటుంది. కాగా, హైస్పీడ్ రైల్ కారిడార్ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖపట్టణానికి పట్టే 12 గంటల ప్రయాణ సమయం నాలుగు గంటలకు తగ్గుతుంది.
Hyderabad
Visakhapatnam
Vijayawada
High Speed Rail Project

More Telugu News