prisoner: ఎన్ కౌంటర్ చేయనని రాసిస్తేనే.. యూపీ పోలీసులకు ఖైదీ షరతు!
- యోగి సర్కారుకి వణికిపోతున్న నేరస్థులు
- ఖైదీకి డయాలసిస్ అవసరమని చెప్పిన వైద్యులు
- ఎన్ కౌంటర్ భయంతో మొండికేసిన ఖైదీ
- సర్దిచెప్పడంతో చికిత్సకు ఒప్పుకున్న వైనం
ఉత్తర ప్రదేశ్ లో యోగి సర్కారు తీరుతో నేరస్థులు వణికిపోతున్నారు. ఎక్కడ ఎన్ కౌంటర్ చేస్తారోనని భయాందోళనలతో గడుపుతున్నారు. పట్టుబడ్డ నేరస్థులు కూడా జైలు నుంచి బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హర్దోయి జిల్లా జైలులో ఓ ఖైదీ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆ ఖైదీకి డయాలసిస్ అవసరమని జైలు వైద్యులు తెలిపారు. దీంతో ఖైదీని తగిన సెక్యూరిటీతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీరా ఆసుపత్రికి చేరుకున్న తర్వాత డయాలసిస్ చేయించుకోవడానికి ఖైదీ ససేమిరా అన్నాడు. పోలీసులు తనను ఎన్ కౌంటర్ చేస్తారని ఆందోళన వ్యక్తం చేశాడు.
ఎన్ కౌంటర్ చేయనని రాతపూర్వక హామీ ఇస్తేనే చికిత్స చేయించుకుంటానని పట్టుబట్టాడు. వైద్యులు, పోలీసులు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. చివరకు ఉన్నతాధికారులు కల్పించుకుని హామీ ఇచ్చాక డయాలసిస్ చేయించుకున్నాడు. చికిత్స పూర్తయ్యాక ఆ ఖైదీని పోలీసులు తిరిగి జిల్లా జైలుకు తరలించారు.