Andhra Pradesh: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు.. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరిలో వైసీపీ జయకేతనం
- శ్రీకాకుళంలో నర్తు రామారావు విజయం
- పశ్చిమ గోదావరిలో కవురు శ్రీనివాస్, రవీంద్రనాథ్ విజయం
- కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఏపీలోని శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో స్థానిక కోటా కింద జరిగిన ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. శ్రీకాకుళంలో వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు విజయం సాధించారు. మొత్తం 752 మంది స్థానిక సంస్థల ప్రతినిధులు ఓటు వేయగా రామారావుకు 632 ఓట్లు పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థి ఆనేపు రామకృష్ణ 108 ఓట్లతో సరిపెట్టుకున్నారు. మరో 12 ఓట్లు చెల్లకుండా పోయాయి.
ఇక, పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలనూ వైసీపీ అభ్యర్థులు.. కవురు శ్రీనివాస్, రవీంద్రనాథ్ గెలుచుకున్నారు. చిత్తూరు జిల్లాలో ఐదు స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. తెలంగాణలోని హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం సహా ఏపీలోని మిగతా స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం స్థానిక సంస్థల కోటా ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. అనంతరం పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తారు.