Inter exams: మెదక్ లో ఇంటర్ పరీక్ష రాసేందుకు కుమార్తెను భుజంపై మోసుకెళ్లిన తండ్రి
- కాలు విరిగినా వీల్ చెయిర్ ఇవ్వకపోవడంతో తండ్రి నిర్ణయం
- మోసుకెళ్లడానికి కూడా తొలుత అనుమతించలేదని ఆవేదన
- గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకుని పరీక్షకు దూరమైన మరో స్టూడెంట్
తెలంగాణలో బుధవారం ప్రారంభమైన ఇంటర్ పరీక్షల సందర్భంగా పలువురు విద్యార్థులు అవస్థలపాలయ్యారు. సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి తిప్పలు పడ్డారు. ఈ క్రమంలో మెదక్ లో ఓ తండ్రి తన కూతురును పరీక్షా కేంద్రానికి భుజాలపై మోసుకుని తీసుకొచ్చాడు. కుమార్తె కాలు విరగడంతో వీల్ చెయిర్ కావాలని కోరగా.. అధికారులు స్పందించలేదు. దీంతో కూమార్తెను ఎత్తుకుని ఎగ్జామ్ హాల్ కు తీసుకెళ్లాడు.
మెదక్ పట్టణానికి చెందిన ఇంటర్ విద్యార్థిని శ్రీవర్షకు ఇటీవల కాలు విరిగింది. బుధవారం పరీక్ష కోసం తండ్రి వెంకటేశంతో కలిసి వాహనంలో టీఎస్ఎస్ఆర్డబ్ల్యూజేసీ కేంద్రానికి చేరుకుంది. గేటు నుంచి లోపల హాల్ వరకు చాలా దూరం ఉండడంతో వీల్ చెయిర్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్వాహకులను వెంకటేశం సంప్రదించాడు.
అధికారులు ఎవరూ పట్టించుకోలేదని, వీల్ చెయిర్ అందించలేదని ఆరోపించాడు. చేసేదేంలేక కుమార్తెను తన భుజాలపై ఎత్తుకుని ఎగ్జామ్ హాల్ కు తీసుకెళ్లానని చెప్పాడు. తొలుత ఇలా తీసుకెళ్లడానికి కూడా సెక్యూరిటీ సిబ్బంది అభ్యంతరం చెప్పారని వెంకటేశం విమర్శించారు.
గూగుల్ మ్యాప్స్ నమ్ముకుని వెళితే..
ఎగ్జామ్ సెంటర్ కు ఎలా చేరుకోవాలని గూగుల్ మ్యాప్స్ ను ఆశ్రయించిన ఓ ఇంటర్ విద్యార్థి చివరకు పరీక్షకు దూరమయ్యాడు. గూగుల్ మ్యాప్స్ అతడిని వేరే సెంటర్ కు తీసుకెళ్లడంతో సకాలంలో తన సెంటర్ కు చేరుకోలేకపోయాడు. ఖమ్మం రూరల్ మండలం కొండాపురానికి చెందిన కొండా వినయ్ ఖమ్మంలోని ఆర్జేసీ కాలేజీలో చదువుతున్నాడు. అదే సిటీలోని ఎన్ఎస్పీ ప్రభుత్వ స్కూల్లో ఎగ్జామ్ సెంటర్ పడింది.
ఈ సెంటర్ ను గుర్తించేందుకు గూగుల్ మ్యాప్స్ ను ఆశ్రయించాడు. అయితే, అది తప్పుడు లొకేషన్ కు తీసుకెళ్లడంతో తన సెంటర్ చేరుకోవడానికి పరుగందుకున్నాడు. అయినా సెంటర్ చేరేసరికి పరీక్ష మొదలై దాదాపు అరగంట కావొస్తోంది. దీంతో వినయ్ ను పరీక్షా కేంద్రంలోకి అధికారులు అనుమతించలేదు.