Payyavula Keshav: అంత అభివృద్ధి రేటు సాధించారా... మరి ఆదాయం ఏదీ?: వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పయ్యావుల

Payyavula questions YCP govt over budget

  • వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం
  • బుగ్గన ప్రజలకు మాయా ప్రపంచం చూపించారన్న పయ్యావుల
  • బుగ్గన మాటలు కోటలు దాటుతున్నాయని వ్యాఖ్య 
  • ప్రభుత్వ చేతలు గడప కూడా దాటడంలేదని విమర్శలు

ఏపీ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ పై టీడీపీ ఎమ్మెల్యే, ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ పయ్యావుల కేశవ్ స్పందించారు. వైసీపీ ప్రభుత్వ చిట్టచివరి బడ్జెట్ (2023-24) ద్వారా ఎప్పటిలానే ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు మాయా ప్రపంచం చూపే ప్రయత్నం చేశారని విమర్శించారు. బుగ్గన మాటలు కోటలు దాటుతుంటే, ప్రభుత్వ చేతలు మాత్రం గడప కూడా దాటడం లేదనేలా బడ్జెట్ ఉందని కేశవ్ వ్యాఖ్యానించారు. 

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బడ్జెట్లో పెరుగుతున్న లక్షల కోట్ల అభివృద్ధి, క్షేత్రస్థాయిలో ఎక్కడా కనిపించడం లేదని విమర్శించారు. సాగునీటి రంగం, ఇతర ప్రధాన రంగాలకు టీడీపీ ప్రభుత్వం పెట్టిన ఖర్చుతో పోలిస్తే, ఈ 4 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన ఖర్చు చాలా చాలా తక్కువ అని పేర్కొన్నారు. 

"గడచిన నాలుగేళ్లలో వివిధ ప్రధాన రంగాలకు జగన్ ప్రభుత్వం రూ.20 వేల కోట్లు కూడా ఖర్చుపెట్టలేదు. అవి కూడా పాత బిల్లుల చెల్లింపులకే. అంటే రూ.10 వేల కోట్లు కూడా ఖర్చుపెట్టలేదు. ఉదాహరణకు చంద్రబాబు హయాంలో కేటాయింపులు రూ.100  ఉంటే, ఖర్చు రూ.95 ఉండేది. వైసీపీ ప్రభుత్వంలో ఖర్చులు రూ.40, 50కే పరిమితం అవుతున్నాయి. 

నిధుల కేటాయింపు, ఖర్చుల్లో వైసీపీ ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదు. ఈమాట మేం అంటున్నదికాదు... కాగ్ చెబుతోంది. రూ.86 వేల కోట్ల ఖర్చుకి వైసీపీ ప్రభుత్వం లెక్కలు చూపలేదని కాగ్ వెల్లడించింది. మాటలు, కవితలతో ఆకట్టుకోవాలనిచూస్తే సామాన్యులకు ఒరిగేదేం లేదని ఆర్థికమంత్రి బుగ్గనకు చురక అంటించారు.

పయ్యావుల వ్యాఖ్యల ముఖ్యాంశాలు....

  • గ్రోత్ రేట్ పెరిగితే ఆదాయం పెరగాలని అన్న జగన్, ఇప్పుడు తన ప్రభుత్వంలో గ్రోత్ రేట్ పెరిగినా ఆదాయం ఎందుకు పెరగలేదో సమాధానం చెప్పాలి.  
  • గ్రోత్ రేట్ పెరిగితే ఆదాయం పెరగాలని గతంలో జగన్ అన్నాడు. రైతుభాషలో చెప్పాలంటే పంట ఏపుగా పెరిగితే దిగుబడి పెరగాలి. అదే లెక్కన ఏపీప్రభుత్వం అభివృద్ధి బ్రహ్మండంగా చేస్తే, దానికి తగినట్టు ఆదాయం పెరగాలికదా! 
  • చంద్రబాబు హయాంలో సాధించిన వృద్ధిరేటుని వైసీపీ ప్రభుత్వం తన ఘనతగా చెప్పుకుంది. జగన్ తన నాలుగేళ్ల పాలనలో సాధించిన గ్రోత్ రేట్ సున్నా. 
  • కరోనాటైమ్ లో కూడా అద్భుత ప్రగతి నమోదైందని ప్రకటనలు వేశారు. ఆ ఏడాది అక్వారంగం ఆదాయం బాగా పెరిగినట్టు చెప్పా రు. వాస్తవంలో మాత్రం ప్రపంచవ్యాప్తంగా కూడా ఆక్వా ఎగుమతులు ఆగిపోయి, ఆ రంగం తిరోగమనంలో పయనించింది. దేశంలోకూడా ఆక్వా రంగం పరిస్థితి అలానే తయారైంది. అలాంటిది ఏపీ మాత్రం ఆక్వా రంగంలో ప్రగతి సాధించినట్టు చెప్పింది. ఇలాంటి మర్మాలు సామాన్యులకు అర్థంకావు.  
  • జగన్ ప్రభుత్వం నిజంగా అద్భుతమైన గ్రోత్ రేట్ సాధిస్తే, దానికి తగినట్టు ప్రభుత్వ ఆదాయం ఎందుకు పెరగలేదో, గొప్ప ఆర్థికవేత్త అయిన జగన్ సమాధానం చెప్పాలి. 2018-19లో రాష్ట్ర ఆర్థిక వృద్ధిరేటు 22 శాతం ఉంటే, తాము మొట్ట మొదటిస్థానానికి తీసుకొచ్చామని చెప్పారు. ఎలా తీసుకొచ్చారో ఆర్థికశాఖామంత్రి వివరాలు బయటపెట్టగలరా? ఈ వ్యవహారంపై శాసనసభలో మేం లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పగల ధైర్యం ఆర్థికమంత్రి బుగ్గనకు ఉందా?
  • 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఉన్నరెవెన్యూలోటు రూ.13,898కోట్లు. ఈ నాలుగేళ్లలో జగన్ ప్రభుత్వం దాన్ని రూ. 1 లక్షా10 వేల కోట్లకు పెంచింది. ఇంతపెంచి... మూలధన వ్యయం పెంచారా అంటే, అదీ లేదు.  
  • చంద్రబాబు హయాంలో మూలధన వ్యయం 12.18 శాతముంటే, జగన్ ప్రభుత్వంలో అది 6.77 శాతం మాత్రమే. కేపిటల్ ఎక్స్ పెండిచర్ కు నిధులు వెచ్చించకుండా ప్రభుత్వ ఆదాయం ఎలా పెరుగుతుంది?
  • ముఖ్యమంత్రి ఎకనమిస్ట్ కాదు... గ్రేట్ కేపిటలిస్ట్. ఆయన ఆర్థికవిధానాలు స్టడీ చేయడానికి అంతర్జాతీయ సంస్థలు తహతహలాడుతున్నాయి మరి! 
  • ముఖ్యమంత్రి తనకు తాను గొప్ప ఎకనమిస్ట్ నని చెప్పుకుంటున్నాడు. పాకిస్తాన్ పాలిటిక్స్, శ్రీలంక ఎకనామిక్స్ లో జగనే దిట్ట! 
  • గ్రేటెస్ట్ కేపిటలిస్ట్ అయిన జగన్ పొరపాటున ఎకనమిస్ట్ అని చెప్పుకుంటున్నట్టున్నాడు. ప్రజాస్వామ్యానికి కాదు... జగన్ ధనస్వామ్యానికి నిలువెత్తు రూపం. అలాంటి వ్యక్తి తాను పేదవాడినని చెప్పడం సిగ్గుచేటు.   
  • క్యాష్ వార్ లో జగన్ బలంగా ఉన్నాడు... వచ్చే ఎన్నికల్లో దాన్నే అమలు చేస్తాడు. కానీ ప్రజలు వచ్చే ఎన్నికల్లో క్లాస్ వార్, క్యాష్ వార్ ను కాకుండా, పెర్ఫార్మెన్స్ వార్ నే నమ్ముతారు.
  • జగన్ అద్భుతాలకు గొప్ప పరిశ్రమలు, గొప్ప పెట్టుబడులు వచ్చాయి. జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ సంస్థలకు వస్తున్న లాభాలే అందుకు నిదర్శనం.  
  • జగన్ తన విధానాలతో పేదరికాన్ని కాకుండా పేదల్ని నిర్మూలిస్తున్నాడు!  
  • జగన్ ఒక్కసారి నేలమీద నడిస్తేనే (పాదయాత్ర) ప్రజల జీవితాలు తలకిందులయ్యాయి. ఆయన ఎప్పుడూ ప్రత్యేక విమానాల్లో గాల్లో తిరిగితేనే రాష్ట్రానికి, జనానికి మంచిది.
  • ఢిల్లీ నుంచి తన మిత్రులకు నోటీసులు వచ్చాకే జగన్ ఢిల్లీ పర్యటన ఖరారవుతుంది. స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం వేదికను బీసీల వేదికగా మార్చారు. టీడీపీ మాది అని బీసీలంతా గర్వంగా చెప్పుకుంటున్నారు. బీసీల్ని జగన్ నా బీసీలు అంటుంటే వారు భయపడుతున్నారు. నా అన్నవారిని జగన్ ఏంచేశాడో అందరికీ తెలుసుకదా!” అని పయ్యావుల కేశవ్ ఎద్దేవాచేశారు.

  • Loading...

More Telugu News