TCS: టీసీఎస్ సంస్థలో అనూహ్య మార్పు.. సీఈఓ రాజీనామా
- ప్రస్తుత సీఈఓ రాజేశ్ గోపీనాథన్ రాజీనామా చేసినట్టు టీసీఎస్ ప్రకటన
- బోర్డు, చైర్మన్‌తో చర్చించాకే రాజీనామాకు సిద్ధమయ్యానన్న రాజేశ్
- ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ సంస్థలో కొనసాగనున్నట్టు వెల్లడి
- తదుపరి సీఈఓగా కె.కృతివాసన్ ఎంపిక
ప్రముఖ ఐటీ సేవల సంస్థ టీసీఎస్ నాయకత్వంలో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. గత ఆరేళ్లుగా సంస్థకు సీఈఓగా సేవలందిస్తున్న రాజేశ్ గోపీనాథన్ తన పదవికి రాజీనామా చేసినట్టు టీసీఎస్ గురువారం ప్రకటించింది. ఆయన పదవీకాలం ఇంకా నాలుగేళ్లు ఉండగానే రాజేశ్ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకోవడం ఆసక్తికరంగా మారింది. అయితే రాజేశ్ గోపీనాథన్ ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ టీసీఎస్‌లోనే కొనసాగుతారని, తదుపరి సీఈఓకు మార్గనిర్దేశనం చేస్తారని సంస్థ వెల్లడించింది. ఇక టీసీఎస్ సంస్థకు చెందిన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ విభాగానికి నేతృత్వం వహిస్తున్న కె.కృతివాసన్ టీసీఎస్ సీఈఓగా మార్చి 16న బాధ్యతలు చేపట్టనున్నారు.
కాగా.. టీసీఎస్ సంస్థ సీఈఓగా తనకు ఈ ఆరేళ్లు అద్భుతంగా గడిచిపోయాయని రాజేశ్ గోపీనాథన్ తెలిపారు. సంస్థలో తనది 22 ఏళ్ల పాటు సాగిన అద్భుతమైన ప్రయాణమని చెప్పుకొచ్చారు. తన నేతృత్వంలో సంస్థ ఆదాయం 10 బిలియన్ డాలర్ల మేర పెరిగిందని, మార్కెట్ విలువ 70 బిలియన్ డాలర్ల మేర వృద్ధి చెందిందని పేర్కొన్నారు.
‘‘తదుపరి ఏం చేయాలనే విషయమై నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఇక.. రాజీనామా విషయమై సుదీర్ఘంగా ఆలోచించి, చైర్మన్‌తో పాటూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌తో చర్చించాకే తప్పుకోవాలని నిర్ణయించాను’’ అని రాజేశ్ తెలిపారు. గతేడాదే ఆయన టీసీఎస్ సీఈఓగా పునర్నియమితులయ్యారు. 2027 వరకూ ఆయన సీఈఓగా కొనసాగాల్సి ఉండగా ఇంతలోనే ఆయన రాజీనామా చేశారు.