kaala bhairava: కాలభైరవ ట్వీట్ పై నెటిజన్ల విమర్శలు.. సారీ చెప్పిన సింగర్
- ఆస్కార్ వేదికపై తన ప్రదర్శనను ఉద్దేశిస్తూ కాలభైరవ ట్వీట్
- ఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్లను ప్రస్తావించకపోవడంపై విమర్శలు
- తన ట్వీట్ ను తప్పుగా అర్థం చేసుకున్నారని మరో ట్వీట్
- ఎవరైనా ఇబ్బంది పడితే క్షమించాలని వివరణ
ఆస్కార్ వేదికపై తన ప్రదర్శనను ఉద్దేశిస్తూ గాయకుడు కాలభైరవ చేసిన ట్వీట్ విమర్శలకు దారితీసింది. దీంతో తన ట్వీట్ ను తప్పుగా అర్థం చేసుకున్నారని, ఎవరైనా ఇబ్బంది పడితే క్షమించాలని కోరారు. తన వ్యాఖ్యలకు ట్విట్టర్ లో వివరణ కూడా ఇచ్చారు.
ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఆస్కార్ వేదికపై రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ కలిసి నాటు నాటు పాట పాడారు. తాను ఈ ప్రదర్శన ఇవ్వడానికి సాయపడిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ కాలభైరవ ఓ ట్వీట్ చేశారు.
‘‘అకాడమీ స్టేజ్ పై లైవ్ లో ‘నాటు నాటు’ ప్రదర్శన ఇచ్చినందుకు ఎంతో గర్విస్తున్నా. రాజమౌళి బాబా, నాన్న, ప్రేమ్ రక్షిత్, కార్తికేయ అన్న, అమ్మ, పెద్దమ్మ.. ఇలా వీరందరూ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నాకు ఈ విలువైన అవకాశం దక్కేలా సాయం చేశారు. వాళ్ల శ్రమ, పనితనం వల్లే ఈ పాట ప్రపంచం నలుమూలలకు చేరి.. అందరితో డ్యాన్స్ చేయించింది. అందుకే ఈ అవకాశం నన్ను వరించింది. వాళ్ల విజయంలో నేనూ భాగమైనందుకు సంతోషిస్తున్నా’’ అని పేర్కొన్నారు.
అయితే నాటు నాటు పాట అంత హిట్ కావడానికి ముఖ్య కారకులైన ఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్లను ప్రస్తావించకపోవడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో కాలభైరవ వారికి క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు మరో ట్వీట్ చేశారు.
‘‘ఆర్ఆర్ఆర్, నాటు నాటు విజయంలో ఎన్టీఆర్, రామ్ చరణే ప్రధాన కారణం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆస్కార్ స్టేజీపై ప్రదర్శన ఇవ్వడానికి నాకెంతో తోడ్పడిన వారి గురించి మాత్రమే నేను ట్వీట్ లో ప్రస్తావించాను. అంతేతప్ప.. వేరే ఉద్దేశం నాకు లేదు. నేను చేసిన ట్వీట్ తప్పుగా అర్థమైందని తెలుస్తోంది. ఇందుకు క్షమాపణలు కోరుతున్నా’’ అని పేర్కొన్నారు.