Junior NTR: విష్వక్సేన్ ఇక డైరెక్షన్ ఆపేయాలి: ఎన్టీఆర్
- 'దాస్ కా ధమ్కీ' గురించి మాట్లాడిన ఎన్టీఆర్
- విష్వక్ కి సినిమా పిచ్చి ఎక్కువని వ్యాఖ్య
- అలాంటివారి సినిమాలు ఆడాలని ఆకాంక్ష
- విష్వక్ మాటకి బాధపడ్డానన్న ఎన్టీఆర్
విష్వక్సేన్ హీరోగా నటించి .. దర్శక నిర్మాతగా వ్యవహరించిన 'దాస్ కా ధమ్కీ' సినిమా ఈ నెల 22వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటుకి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఆయన మాట్లాడుతూ .. "విష్వక్ ఒక ఎనర్జీ బాల్ .. ఆయనలా మైకులో నేను మాట్లాడలేను. నేనే అంటే ఆయన నాకంటే ఎక్కువగా మాట్లాడతాడు. మనసు బాగోలేనప్పుడు నేను చూసే సినిమాల్లో 'ఈ నగరానికి ఏమైంది' ఒకటి" అన్నారు.
"నటుడిగా .. దర్శకుడిగా విష్వక్ లో నాకు నచ్చింది కాన్ఫిడెన్స్. విష్వక్ ఒక చట్రంలోకి వెళ్లిపోతున్నాడేమో అని నేను అనుకుంటున్న సమయంలో ఆయన 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమా చేశాడు. పాత్ర కోసం ఆయన మారిపోయిన తీరు చూస్తే నాకే ఆశ్చర్యమేసింది. తను చాలా పరిణతిని సాధించాడనిపించింది. అలా మారిపోవడానికి నాకే చాలా సమయం పట్టింది" అని చెప్పారు.
'దాస్ కా ధమ్కీ' ఈ నెల 22న వస్తోంది .. తప్పకుండా అది బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. అయితే విష్వక్ ఈ సినిమాతో ఇక దర్శకత్వం ఆపేయాలి .. కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వాలి. ఎందుకంటే ఈ సినిమాకి ఉన్నదంతా పెట్టేశాను అని తను చాలా నిజాయతీగా చెప్పాడు. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. సినిమా పట్ల ఆయనకి ఎంత పిచ్చి ఉందనేది నాకు అప్పుడు అర్థమైంది. ఇలాంటివారి సినిమాలు ఆడాలి" అంటూ చెప్పుకొచ్చారు.