Andhra Pradesh: ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ విజయం!

TDP Won Two Graduate MLC Seats In Andhrapradesh

  • ఉత్తరాంధ్ర స్థానంలో వేపాడ చిరంజీవిరావు, తూర్పు రాయలసీమ స్థానంలో కంచర్ల శ్రీకాంత్ విజయం
  •  పశ్చిమలో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య స్వల్ప తేడా
  • నేటి సాయంత్రం లోపు తుది ఫలితాలు

ఆంధ్రప్రదేశ్‌లో మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండింటిని టీడీపీ కైవసం చేసుకుంది. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ స్థానాన్ని టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు కైవసం చేసుకోగా, తూర్పు రాయలసీమ శాసనమండలి గ్రాడ్యుయేట్ స్థానంలో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించారు. పశ్చిమ రాయలసీమ స్థానంలో మాత్రం హోరాహోరీ కొనసాగుతోంది. 

ఉత్తరాంధ్ర స్థానంలో విజయం సాధించిన చిరంజీవిరావు విజయానికి అవసరమైన ఓట్లలో 90 శాతం తొలి ప్రాధాన్యత ఓట్లలో సాధించగా మిగిలినవి రెండో ప్రాధాన్యత ఓట్లు రావడంతో ఆయన విజయం సాధించారు. విజయానికి 94,509 ఓట్లు అవసరం కాగా, తొలి ప్రాధాన్యంలో 82,958, రెండో ప్రాధాన్యంలో 11,551 ఓట్లు సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో కలిపి చిరంజీవిరావుకు మొత్తం 1,12,686 వచ్చాయి. వైసీపీ అభ్యర్థి సుధాకర్ టీడీపీ అభ్యర్థికి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయారు. ఇద్దరి మధ్య భారీ తేడా కనిపించింది.  సిటింగ్‌ ఎమ్మెల్సీ, భాజపా అభ్యర్థి మాధవ్‌ సహా 34 మందికి డిపాజిట్లు గల్లంతయ్యాయి.  

తూర్పు రాయలసీమ శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ గెలుపొందారు. రెండో ప్రాధాన్య ఓట్లతో కలిపి శ్రీకాంత్ 1,12,686 ఓట్లు సాధించారు. వైసీపీ అభ్యర్థి శ్యాంప్రసాద్‌రెడ్డికి 85,423 ఓట్లు పోలయ్యాయి.

పశ్చిమలో హోరాహోరీ
పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ స్థానంలో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ సాగుతోంది. ఈరోజు  ఉదయానికి  మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో  మొత్తం  11 రౌండ్లు పూర్తయ్యాయి . మొత్తం 2,45,576 ఓట్లు పోలవగా ఇందులో  వైసీపీ బలపరిచిన వెన్నపూస రవీంద్రారెడ్డికి 95,969, టీడీపీ బలపరిచిన భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డికి 94,149 ఓట్లు పోలయ్యాయి.  మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ గెలుపుకు సరిపడిన ఓట్లు రానందువలన రెండవ  ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును ప్రారంభించారు.  తుది ఫలితాలు నేటి సాయంత్రం లోపు వచ్చే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News