Congress: పుట్టుకొస్తున్న కొత్త ఫ్రంట్.. బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా చేతులు కలిపిన అఖిలేశ్-మమత

Mamata Banerjee and Akhilesh Yadav Join Hands for Third Front
  • కాంగ్రెస్-బీజేపీయేతర కూటమిపై మమత, అఖిలేశ్ చర్చలు
  • ఈ నెల 23న నవీన్ పట్నాయక్‌తో మమత భేటీ
  • కొత్త కూటమిని థర్డ్ ఫ్రంట్‌గా పిలవబోమన్న టీఎంసీ ఎంపీ
కాంగ్రెస్‌ లేని మరో కూటమికి రంగం సిద్ధమవుతోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. నిన్న ఈ ఇద్దరు నేతలు సమావేశమై కాంగ్రెస్, బీజేపీయేతర కూటమిపై చర్చలు జరిపారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ గాంధీని ప్రతిపక్షాలకు నాయకుడిగా చూపించడం ద్వారా లబ్ధిపొందాలని బీజేపీ చూస్తోందన్న విమర్శల నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. 

రాహుల్ గాంధీని ప్రతిపక్షాల ప్రతినిధిగా వాడుకోవాలని చూస్తోందని, ఫలితంగా అది లబ్ధి పొందుతోందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ అన్నారు. ప్రతిపక్షాలకు కాంగ్రెస్ బాస్ అన్నది అపోహ మాత్రమేనని ఆయన తేల్చి చెప్పారు. మరోవైపు, కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా జట్టుకట్టడంపై అఖిలేశ్‌తో మాట్లాడిన మమత ఈ నెల 23న ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్‌తో సమావేశం కానున్నట్టు సుదీప్ తెలిపారు. బీజేపీని ఎదుర్కొనే సత్తా ప్రాంతీయ పార్టీలకు ఉందన్న ఆయన.. ఈ కొత్త కూటమిని తాము థర్డ్ ఫ్రంట్‌గా పిలవబోమని స్పష్టం చేశారు. 

మమతతో భేటీ అనంతరం అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్‌లకు తాము సమదూరం పాటించాలని నిర్ణయించినట్టు చెప్పారు. తాము దీదీ (మమత)తోనే ఉన్నామని పేర్కొన్నారు. ‘బీజేపీ వ్యాక్సిన్’ తీసుకున్న వారికి సీబీఐ, ఈడీ, ఐటీలతో ఎలాంటి ఇబ్బంది ఉండదని పరోక్షంగా బీజేపీపై విమర్శలు సంధించారు. ప్రతిపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు నమోదు చేసిన కేసులను వారు బీజేపీలో చేరగానే వెనక్కి తీసుకోవడాన్ని ప్రస్తావిస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
Congress
BJP
TMC
Samajwadi Party
Third Front

More Telugu News