USA: ‘అమెరికాలో కుటుంబ వ్యవస్థ కూలిపోయింది..అందుకే ఈ సంక్షోభం: మెక్సికో అధ్యక్షుడు

Mexican president blames disintegration of family values for fentanyl crisis in usa

  • అమెరికాలో ‘ఫెంటనైల్’ మరణాలపై మెక్సికో అధ్యక్షుడి సంచలన కామెంట్
  • అగ్రరాజ్యంలో కుటుంబవ్యవస్థ కూలిపోయిందని వ్యాఖ్య
  • కుటుంబాలకు దూరమైన యువత మాదకద్రవ్యాలకు బానిసవుతోందని వెల్లడి

అమెరికా కుటుంబ వ్యవస్థ కుప్పకూలిపోవడమే మత్తుపదార్థాల వినియోగం పెరగడానికి కారణమని మెక్సికో అధ్యక్షుడు మాన్యుయెల్ లాపేజ్ ఒబ్రాడార్ తాజాగా వ్యాఖ్యానించారు. అగ్రరాజ్య కుటుంబాల్లో తల్లిదండ్రులు పిల్లలను చాలా చిన్న వయసులోనే వేరుగా బతకాలంటూ బయటకు పంపించేస్తారని చెప్పుకొచ్చారు. దీంతో.. కుటుంబసభ్యుల ఆత్మీయపరామర్శకు దూరమైన అనేక మంది ఫెంటనైల్ వంటి సింథటిక్ ఓపియాయిడ్ ఔషధాలకు బానిసలుగా మారుతున్నారన్నారు. మత్తుకు బానిసలైపోయిన పలువురు అధిక మోతాదుల్లో ఫెంటనైల్ వాడి ప్రమాదం కొనితెచ్చుకుంటున్నారని చెప్పారు. ‘‘అమెరికాలో కుటుంబాలు కుప్పకూలుతున్నాయి. ఇండివిడ్యువలిజం పెరిగిపోయింది. అక్కడి కుటుంబాల్లో ప్రేమాభిమానాలు, ఆత్మీయ ఆలింగనాలు, పరామర్శలు కొరవడ్డాయి’’ అని మాన్యూయెల్ వ్యాఖ్యానించారు. 

ప్రస్తుతం అమెరికాలో ఫెంటనైల్ దుర్వినియోగం కలకలం రేపుతోంది. మత్తు కోసం అనేక మంది ఈ డ్రగ్‌ను పరిమితికి మించి వాడి ఇబ్బందుల్లో పడుతున్నారు. ఈ డ్రగ్ దుర్వినియోగం కారణంగా ఏటా అగ్రరాజ్యంలో 70 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో అమెరికా చట్టసభల సభ్యులు కొందరు మెక్సికో డ్రగ్స్ గ్యాంగులపై వేలెత్తి చూపుతున్నారు. అమెరికాకు ఫెంటనైల్ సరఫరా చేసే ఈ గ్యాంగుల పనిపట్టేందుకు మెక్సికోపై సైన్యాన్ని కూడా ప్రయోగించాలని వారు ప్రభుత్వానికి సూచించారు.  

అయితే.. తమ దేశంలో ఫెంటనైల్ సమస్య లేదని మెక్సికో అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. తమ దేశంలోని బలమైన కుటుంబవ్యవస్థే దీనికి కారణమని స్పష్టం చేశారు. పరిశీలకులు మాత్రం భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అమెరికా మార్కెట్‌ ద్వారా భారీ లాభాలు కళ్లచూస్తున్న నిందితులు మెక్సికోపై దృష్టి పెట్టకపోవడంతోనే అక్కడ ఫెంటనైల్ సమస్య తక్కువగా ఉందని అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News