Team India: విశాఖలో ఉదయం నుంచి భారీ వర్షం.. రెండో వన్డేపై నీలినీడలు!
- భారత్-ఆస్ట్రేలియా మధ్య నేడు రెండో వన్డే
- మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్
- మొన్న, నిన్న కూడా వైజాగ్‌లో వర్షం
- మ్యాచ్ నిర్వహణ కష్టమనే అభిప్రాయం
- రోజంతా వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నేడు విశాఖపట్టణంలో రెండో వన్డే జరగాల్సి ఉంది. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఉదయం నుంచీ నగరంలో భారీ వర్షం కురుస్తుండడంతో మ్యాచ్ నిర్వహణపై అనుమానాలు నెలకొన్నాయి. దీంతో ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసి మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు నిరాశలో మునిగిపోయారు.
నగరంలో మొన్న, నిన్న కూడా వర్షం కురిసింది. దీంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. ఈ ఉదయం మళ్లీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. వర్షం తగ్గినా మధ్యాహ్నం, రాత్రికి మళ్లీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోంది. దీంతో మ్యాచ్ నిర్వహణ కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఒకవేళ మధ్యాహ్నానికి వర్షం తగ్గి, తెరిపినిస్తే మ్యాచ్‌ను ఆలస్యంగానైనా మొదలుపెట్టాలని భావిస్తున్నారు. అదీ కుదరకపోతే ఓవర్లు కుదించి అయినా సరే మ్యాచ్ జరిపించాలని యోచిస్తున్నారు. వీటిలో ఏది జరగాలన్నా వరుణుడు శాంతించాల్సి ఉంటుంది.