Naatu Naatu: నాటు నాటు పాటకు జర్మన్ ఎంబసీ సిబ్బంది స్ట్రీట్ డ్యాన్స్... వీడియో పంచుకున్న ఆనంద్ మహీంద్రా
- ఆర్ఆర్ఆర్ చిత్రంలో విశేష ప్రజాదరణ పొందిన నాటు నాటు పాట
- ఇటీవల ఆస్కార్ తో మరింత పాప్యులారిటీ
- కొన్నిరోజుల కిందట ఢిల్లీలో కొరియన్ ఎంబసీ సిబ్బంది డ్యాన్స్
- ఈసారి జర్మనీ సిబ్బంది వంతు
- నెక్ట్స్ ఎవరు అంటూ ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా
ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట ఇటీవల గెల్చుకున్న ఆస్కార్ తో సరిహద్దులు, భాషలకు అతీతంగా ప్రజల్లోకి వెళుతోంది. కొన్నిరోజుల కిందట ఢిల్లీలో కొరియా దౌత్య సిబ్బంది నాటు నాటు పాటకు డ్యాన్స్ చేయడం తెలిసిందే. ఇప్పుడదే బాటలో జర్మనీ దౌత్య సిబ్బంది కూడా నాటు నాటు పాటకు స్ట్రీట్ డ్యాన్స్ చేశారు.
ఈ పాటలో జర్మన్ ఎంబసీ ఉద్యోగులతో కలిసి జర్మనీ రాయబారి కూడా కాలు కదపడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోను భారత వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా పంచుకున్నారు.
కొరియన్ ఎంబసీ తరహాలోనే జర్మనీ దౌత్య కార్యాలయ సిబ్బంది కూడా ఢిల్లీ చాందినీ చౌక్ లో నాటు నాటు పాటకు స్టెప్పులేశారని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. చూస్తుంటే నాటు నాటు పాటకు ఎవరు బాగా డ్యాన్స్ చేస్తారో అని దౌత్య కార్యాలయాలు ఒలింపిక్స్ తరహాలో పోటీ పడుతున్నట్టుంది అని చమత్కరించారు. మరి ఈ వరుసలో నెక్ట్స్ డ్యాన్స్ చేసే ఎంబసీ ఏ దేశానిది? అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.