Pawan Kalyan: అకాల వర్షాలతో రైతాంగం దెబ్బతింది... ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలి: పవన్ కల్యాణ్

Pawan Kalyan responds on untimely rains hit farmers so hard

  • ఏపీలో గత మూడ్రోజులుగా విస్తారంగా వర్షాలు
  • రైతులు తీవ్రంగా నష్టపోయారన్న పవన్ కల్యాణ్
  • ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలని సూచన
  • తక్షణమే ఆర్థికసాయం, పంట నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి

ఏపీలో కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలులు, వడగండ్లతో రైతాంగం తీవ్రంగా దెబ్బతిన్నదని జనసేనాని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం ఉదారంగా, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. 

ప్రాథమిక అంచనా ప్రకారం 2 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను ఇప్పుడు వడగండ్లతో కూడిన వర్షాలు మరింత కుంగదీస్తున్నాయని తెలిపారు. 

ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మిర్చి రైతులు... ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మామిడి, పొగాకు, మొక్కజొన్న రైతులు... ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉద్యాన పంటల రైతులు... నెల్లూరు జిల్లాలో వరి రైతులు అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయారని వివరించారు. 

రాష్ట్రంలో అరటి, మొక్కజొన్న, కర్బూజ, బొప్పాయి పంటలు కూడా దెబ్బతిన్నాయని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం వీరికి తక్షణమే ఆర్థికసాయం, పంట నష్టపరిహారాన్ని అందించాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News