Chandrababu: ఈసీ ఆదేశాలను కూడా అడ్డుకునే శక్తి జగన్ కు ఉంది: చంద్రబాబు

Chandrababu says Jagan can intercept EC orders

  • పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న చంద్రబాబు
  • రూ.10 వేలు, వెండి నగలు ఇచ్చి మభ్యపెట్టారని ఆరోపణ
  • ఈసీ ఆదేశాలు కాకుండా జగన్ ఆదేశాలు పాటిస్తున్నారని విమర్శలు
  • ఇకపై మీ ఆటలు సాగవన్న టీడీపీ అధినేత

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ విజయాలు అందించిన ఉత్సాహంతో టీడీపీ నాయకత్వం మాటల్లో పదును పెంచింది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. పులివెందులలోనూ తిరుగుబాటు ప్రారంభమైందని అన్నారు. జగన్ నేరాల్లో అధికారులను భాగస్వామ్యం చేస్తున్నారని విమర్శించారు. జగన్ ను నమ్ముకున్నవారిని జైలుకు పంపారని, రాష్ట్రంలో కార్యనిర్వాహక వ్యవస్థ నిర్వీర్యమయ్యే పరిస్థితి నెలకొందని వివరించారు. 

రాష్ట్రంలో నాలుగు వ్యవస్థలు పనిచేయడంలేదని చంద్రబాబు పేర్కొన్నారు. అసెంబ్లీ, శాసనమండలిని ప్రహసనంగా మార్చారని, కోర్టులు, జడ్జిలను బ్లాక్ మెయిల్ చేసే విధంగా ప్రవర్తించారని తెలిపారు. సీఎస్ సహా అధికారులను కోర్టులు చివాట్లు పెట్టే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. 

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అక్రమాలకు పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. ఐదో తరగతి చదివిన వ్యక్తికీ ఓటు హక్కు కల్పించారని మండిపడ్డారు. ఓటుకు రూ.10 వేలు, వెండి నగలు ఇచ్చి మభ్యపెట్టారని వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రచారం నిర్వహించకుండా అడ్డంకులు సృష్టించారని తెలిపారు. ఎన్నికల్లో దొంగ ఓట్లు నివారించడం పెద్ద సమస్యగా మారిందని చంద్రబాబు పేర్కొన్నారు. 

కౌంటింగ్ హాలులోనూ అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు పులివెందుల నుంచి మనుషులను పంపారని, పోరాడి చివరికు టీడీపీ అభ్యర్థి గెలిచినా, డిక్లరేషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. 

ఈసీ ఆదేశాలను కూడా అడ్డుకునే శక్తి జగన్ కు ఉందని అన్నారు. ఎన్నికల ఫలితం ప్రకటించాక కూడా రీకౌంటింగ్ చేయాలని ఒత్తిడి తెచ్చారని, రౌండ్ల వారీగా రీకౌంటింగ్ నిర్వహించాలని కూడా వారికి తెలియదని చంద్రబాబు విమర్శించారు. ఆఖరికి కలెక్టర్ పైనా, ఎస్పీపైనా ఒత్తిడి తీసుకువచ్చారని, ఈసీ ఆదేశాలు కాకుండా జగన్ ఆదేశాలు పాటిస్తున్నారని అన్నారు. ఈసీ ఆదేశాలను నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని తెలిపారు. 

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు పోరాటం చేయాలని, ప్రజలు భాగస్వాములు అయితే తప్ప, టీడీపీ ఒక్కటే సాధించలేదని అభిప్రాయపడ్డారు. ఓటమి అంగీకరించలేని పరిస్థిలో ప్రభుత్వం ఉంది... ఇకపై మీ ఆటలు సాగవు... మీ పనైపోయింది అంటూ చంద్రబాబు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News