India: లండన్​ లో భారత పతాకాన్ని అగౌరవపరిచిన ఖలిస్థానీ మద్దతుదారులు.. కేంద్ర సీరియస్!

India Summons UK diplomat

  • అక్కడి భారత హైకమిషన్ భవనంపై త్రివర్ణ పతాకాన్ని కిందకు దింపిన వైనం
  • దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత విదేశాంగ శాఖ
  • వివరణ ఇవ్వాలని ఢిల్లీలోని బ్రిటన్ దౌత్యవేత్తలకు నోటీసులు

ఖలిస్థానీ సానుభూతిపరుడు, ‘వారిస్‌ పంజాబ్‌ దే’ నేత అమృత్‌పాల్‌ సింగ్‌ అనుచరులను పంజాబ్‌ పోలీసులు అరెస్టు చేసిన అనంతరం రెండు రోజులుగా పంజాబ్‌లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అమృత్‌పాల్‌ కోసం పోలీసుల గాలింపును నిరసిస్తూ అతని మద్దతు దారులు ఆందోళన చేస్తున్నారు. ఇవి లండన్ కు కూడా చేరుకున్నాయి. లండన్‌లోని భారత హైకమిషన్‌ కార్యాలయం వద్ద ఖలిస్థాన్‌ మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. ఖలిస్థాన్ జెండాలతో పెద్ద సంఖ్యలో నిరసన చేపట్టారు. ఈ క్రమంలో భారత త్రివర్ణ పతాకాన్ని ఖలిస్థానీ మద్దతుదారులు అగౌరవ పరిచారు. అక్కడి భారత్‌ హైకమిషన్‌ భవనంపై ఎగురవేసిన జాతీయ జెండా ను కిందికి దింపివేశారు. త్రివర్ణ పతాకాన్ని కిందికి దించివేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. 

ఈ సంఘటనపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు ఢిల్లీలోని బ్రిటన్‌ సీనియర్‌ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. లండన్‌లో ఖలిస్థాన్ వేర్పాటువాదులు చేసిన పనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు భారత్ పేర్కొంది. దీనికి బాధ్యులైన వారిపై వెంటనే అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ఈ చర్యను తీవ్రమైనదిగా పరిగణించిన భారత విదేశాంగ శాఖ అక్కడకు నిరసనకారులు వచ్చేంతవరకూ భారత హైకమిషన్‌ భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. ఘటనపై సమగ్ర వివరణ ఇవ్వాలని కోరింది.

  • Loading...

More Telugu News